శ్రీకాకుళం ఎంపీ సీట్లో ఈసారి రామ్మోహన్ నాయుడికి మామూలుగా ఉండదా? గత రెండు విడతల్లో ఎదురవని, అసలు ఊహించని సమస్యలు ఎదురవబోతున్నాయా? సొంత పార్టీ నేతలే ఆయన్ని ఓడిస్తామని శపధం చేయడానికి కారణాలేంటి? మారుతున్న సిక్కోలు రాజకీయం ఏంటి? తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది శ్రీకాకుళం జిల్లా. కానీ… గత ఎన్నికలలో వైసీపీ హవా నడిచింది. అందుకే ఈసారి పట్టు నిలుపుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది పార్టీ నాయకత్వం. ఆ విషయంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ముందున్నారన్నది పార్టీ వర్గాల మాట. అదే సమయంలో ఈసారి ఆయనకు కూడా అంత తేలిగ్గా ఏం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. 2014 , 2019లో వరుసగా గెలిచిన రామ్మోహన్ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలగా ఉన్నారట. గత ఎన్నికల్లో అంత వైసీపీ జోరులోనూ శ్రీకాకుళం ఎంపీ సీటు టీడీపీ గెలవగలిగిందంటే… పార్టీకి ఇక్కడున్న లీడర్, కేడర్ బేసే కారణమన్నది పొలిటికల్ పండిట్స్ చెప్పే మాట. అదే బలం ఇప్పుడు రామ్మోహన్‌కు బలహీనతగా మారబోతోందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం రామ్మోహన్ నాయుడి మెడకు చుట్టుకుంటుందని, అదే గుదిబండగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన బలపడుతోంది. శ్రీకాకుళం, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లకు ఈసారి టిక్కెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపింది పార్టీ అధిష్టానం. ఇవ్వకపోతే పోయారు…. కనీసం మాట మాత్రం సమాచారం లేకుండా వేరే వాళ్ళకు సీటు ఇచ్చారని, ఇన్నాళ్లు డబ్బు, శ్రమ వెచ్చించి పార్టీ కోసం పనిచేసిన మేం పిచ్చోళ్ళమా అని ప్రశ్నిస్తున్నారట ఇన్ఛార్జ్‌లు. కనీసం అనుచరులకు సర్ది చెప్పుకోవడానికి కూడా ముఖం చెల్లకుండా చేశారని ఆవేదనగా ఉన్నారట. శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి , పాతపట్నంలో కలమట వెంకటరమణ సీట్లు ఆశించారు. ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇన్నాళ్ళు నియెజకవర్గ ఇంచార్జులుగా ఉన్నారు. కానీ…టిక్కెట్స్ మాత్రం వీరికి సమాంతరంగా నియెజకవర్గాల్లో కార్యకలాపాలు నిర్వహించిన రెబల్స్‌కు దక్కాయి.
అందుకు నిరసనగా రెండు నియోజకవర్గాల్లోని కార్యకర్తలు పార్టీ జెండాలు, మినీ మేనిఫెస్టో కాపీలను తగలబెట్టారు. అలాగే… లక్ష్మీదేవి, కలమట వెంకటరమణలకు టిక్కెట్ రాకుండా అడ్డుకున్నది కింజరాపు ప్యామిలీ అన్న అభిప్రాయం నేతల్లో బలపడుతోంది. అందుకే… రామ్మోహన్ నాయుడు ఎంపీగా నిలబడి మా సపోర్ట్ లేకుండా ఎలా గెలుస్తాడో చూస్తామంటూ సవాళ్లు విసురుతున్నారట ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల అనుచరులు. ఓ వర్గం నేతలంతా వీరికి సపోర్ట్ ఇస్తుండటంతో… రామ్మోహన్ వర్గంలో కొత్త గుబులు బయలుదేరినట్టు చర్చ జరుగుతోంది. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు… ఇలా కింజరాపు ఫ్యామిలీ అడుగులకు మడుగులొత్తే నేతలకు టిక్కెట్లు ఇప్పించుకున్నారని, వాస్తవంగా పార్టీ కోసం పనిచేసిన వారిని పూర్తిగా పక్కన పెట్టడం ఏంటని కేడర్ మండిపడుతోందంటున్నారు. బీ ఫామ్‌లు ఇచ్చేలోపైనా పార్టీ అధిష్టానం నిర్ణయం మార్చుకుంటే అందరికీ మంచిదని, లేదంటే తాము ఇండిపెండెంట్స్‌గా బరిలో ఉంటామన్న సంకేతాలు పంపుతున్నారట ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. అదే జరిగితే పాతపట్నం , శ్రీకాకుళంతో పాటు మరికొన్ని సెగ్మెంట్స్ మీద కూడా ఆ ప్రభావం ఉంటుందని, అంతిమంగా ఏం జరుగుతుందో ఆలోచించుకోమంటూ అధిష్టానానికి పరోక్షంగా వార్నింగ్‌లు కూడా ఇస్తున్నట్టు తెలిసింది. ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఓట్లు చీలితే…. అసెంబ్లీ అభ్యర్థులు దెబ్బ తినడంతోపాటు ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడి మీద కూడా ప్రభావం గట్టిగా ఉంటుందని, ఫలితం ఎలాగైనా ఉండవచ్చని అంటున్నారు. పార్టీ కేడర్‌లో కూడా అదే భయం పెరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో… గుండ , కలమట కుటుంబాలతో మాట్లాడి దారికి తెచ్చుకోవడం ఇప్పుడు పార్టీ అధిష్టానానికి ఎంత అవసరమో… వ్యక్తిగతంగా రామ్మోహన్ నాయుడికి అంతకంటే ముఖ్యమన్నది లోకల్ టాక్. మరి ఓడిస్తామని శపధం చేస్తున్న రెబెల్స్‌ని దారికి తెచ్చుకుంటారా? లేక అయితే ఏంటన్న వైఖరితో ఉంటారో చూడాలి.