అక్కడ ఎమ్మెల్యేకి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయట. ఆ చూపిస్తోంది కూడా సొంత కేడరే కావడంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదట. పార్టీ అధిష్టానం దగ్గర పరువు పోతోందిరా.. ప్లీజ్… ఈసారికి కో ఆపరేట్ చేయండర్రా… అని బతిమాలుకుంటున్నా… డోంట్ కేర్,… ఇన్నాళ్ళు ఈ బుద్ధి ఏ గాడిదలు కాసిందని ఘాటుగానే రిప్లయ్ ఇస్తున్నారట. అంతలా ఇరకాటంలో పడ్డ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏంటాయన బతిమూలుడు, బామాలుడు యవ్వారం? కొమురం భీం జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గం తెలంగాణలో నంబర్ వన్ సెగ్మెంట్. రాష్ట్రంలో నియోజకవర్గాల నంబరింగ్ ఇక్కడి నుంచే మొదలైనా… సభ్యత్వాల నమోదులో మాత్రం బాగా వెనకబడి పోయిందంటూ చర్చ జరుగుతోందట బీజేపీలో. మిగతా నియోజకవర్గాలతో పోల్చితే మరీ తక్కువగా కావడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశం అయిందంటున్నారు. పార్టీ కేడర్ ఎమ్మెల్యే హరీష్ బాబుపై కోపంగా ఉండటమే అందుకు కారణం అన్నది ఇంటర్నల్ టాక్. మిగతా చోట్ల క్యాడర్ ఇంటింటికి తిరిగి ఎన్ రోల్ చేయిస్తుంటే… ఇక్కడ మాత్రం ఆ సంగతే పట్టించుకోవడం లేదట. ఎమ్మెల్యే బంధుగణం పెత్తనం పెరిగిపోయి… మిగతా నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో… ద్వితీయ శ్రేణి మొత్తం ఎమ్మెల్యేతో టచ్ మీ నాట్ అనట్టుగా ఉంటున్నారట. దీన్ని అలుసుగా తీసుకుని కింది స్థాయి కేడర్ సైతం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వెరీ లైట్‌గా తీసుకోవడంతో… కథ మొత్తం అడ్డం తిరిగిందంటున్నారు. ఎమ్మెల్యే హరీష్ బాబు గెలిచిన కొద్ది నెలలకే కార్యకర్తలకు దూరం అయ్యేరన్న టాక్ నడుస్తోంది. తాము ఏ పని కోసం వెళ్ళినా… ఎమ్మెల్యే పట్టించుకోరని, పైగా ఇన్ని సార్లు నా దగ్గరికొస్తావా? అది ఎమ్మెల్యే చేయాల్సిన పనా? ఇది ఎమ్మెల్యే చేసే పనా అంటూ కసురుకుంటున్నారంటూ నొచ్చుకుంటున్నారట కార్యకర్తలు.
ఛోటా మోటా లీడర్లు, ఇతర నాయకులు స్టేషన్ పంచాయితీలు, ఇతర సమస్యలతో వస్తుంటారని, అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా చీప్‌గా మాట్లాడితే ఎలాగంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అలా ఇన్నాళ్ళు లోలోపల బాధపడ్డవాళ్ళంతా…. ఇప్పుడు సభ్యత్వ నమోదు రూపంలో మా టైం వచ్చింది, మేమేంటో చూపిస్తామంటూ ఎవరికి వారే మూడంకె వేసి కూర్చుంటున్నట్టు తెలిసింది. దీంతో గత్యంతరం లేక కొన్ని ఏరియాలకు ఎమ్మెల్యేనే నేరుగా వెళ్ళి సభ్యత్వ నమోదు చేయిస్తున్నా… అక్కడి కేడర్ సైతం ముందుకు రాకపోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తోందని అంటున్నారు. వాస్తవానికి ఎవరి స్థాయిలో వారు సభ్యత్వాలు చేయించాలని పార్టీ ఆదేశాలున్నాయి. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఆఖరికి కేంద్రమంత్రి అయినా సరే… ఇందులో మినహాయింపు లేదన్న నిబంధన ఉంది. కానీ… సిర్పూర్ లోకల్ లీడర్లు, క్యాడర్ ఎమ్మెల్యే మీదున్న కోపంతో సభ్యత్వాలపై అస్సలు దృష్టి పెట్టడం లేదంటున్నారు. ప్రతి నియోజకవర్గానికి 50వేల సభ్యత్వాలు చేయించాలన్న టార్గెట్ ఉంది.
కానీ… సిర్పూర్‌లో మాత్రం ఆ సంఖ్య 7 వేలకు దాటకపోగా…గడువు ముంచుకొస్తోంది. దీంతో అసలక్కడ ఏం జరుగుతోందంటూ… పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు లేని చోట ఎక్కువగా సభ్యత్వాలు అవుతుంటే… సిట్టింగ్ ఉన్నచోట ఎందుకు కావడం లేదన్న ప్రశ్నలొస్తున్నాయి. దీన్ని గమనించిన అధిష్టానం ఇంచార్జ్‌లు, సిట్టింగ్ ఎంపీకి ఆదేశాలిచ్చినట్టు సమాచారం. అందుకే హడావిడిగా మీటింగ్స్ పెట్టి ప్రతి బూత్‌లో 100 సభ్యత్వాలు కచ్చితంగా చేయించాలని చెప్పారట. అయినా సరే….క్యాడర్ మాత్రం మనస్పూర్తిగా పనిచేయాడానికి ముందుకు రావడంలేదని చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో ముందుండి ఎమ్మెల్యేని గెలిపించుకుంటే… ఏ పని చేయకుండా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట కార్యకర్తలు. అధిష్టానం జోక్యంతో గడువులోపు క్యాడర్ మెత్తబడి సభ్యత్వాలు అనుకున్నస్థాయిలో చేయిస్తారా.. లేక తాము లేకపోతే ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో పార్టీ పెద్దలకు తెలిసొచ్చేలా చేస్తారా అన్నది చూడాలి మరి.