అక్కడ ఆయన…ఇక్కడ ఈయన. ఫేటు మారుస్తాయన్న కాన్ఫిడెన్స్ తో చేస్తున్న లేటు వయస్సు…ఘాటు రాజకీయాలు హాట్ హాట్ డిస్కషన్ గా మారాయి. రాజకీయ చరమాంకంలో ఆ ఇద్దరి అడుగులు ఎటువైపు అంటూ అనుచరులే తెగ మాట్లాడుకుంటున్నారు. పొన్నాల లక్ష్మయ్య….కడియం శ్రీహరి….దశాబ్దాలుగా రాజకీయాల్లో వున్నవారే. ఇద్దరూ వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు. వీరి రాజకీయాలు కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగా మారిపోయాయి. లక్ష్మయ్య నాలుగు టర్మ్ లు, కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచి 2023 ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నమ్ముకున్న కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం లేదని కారెక్కారు. మరో నేత కడియం శ్రీహరి కూడా ఇలాగే హస్తంగూటికి చేరారు. టిడిపిలో రాజకీయం మొదలుపెట్టిన కడియం…అనేక మంత్రి పదవులు పొందారు. ఇటీవల మారుతున్న రాజకీయాల్లో భాగంగా కడియం కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. లేటు వయస్సులో ఘాటు రాజకీయాల తరహాలో ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు నేతల పొలిటికల్ జర్నీ క్లైమాక్స్ రకరకాల మలుపులు తిరుగుతోంది.
కడియం శ్రీహరి..1994 లో తొలిసారిగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. Ntr కేబినెట్ లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పని చేశారు. తర్వాత చంద్రబాబు హయాంలో సంక్షేమ శాఖ, విద్య, నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2013లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి వరంగల్ నియోజకవర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కడియం శ్రీహరి 2015లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై….తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2023 ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరపై 7,779 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా సాగించారు కడియం. ఇప్పుడు అదే పార్టీ చెంతకు చేరారు. ఎమ్మెల్యేగా గెలిచినా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
మరో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. జనగామ నియోజకవర్గం నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పని చేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పీసీసీ తొలి అధ్యక్షులు అయ్యారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ టికెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో మసస్తాపం చెంది, కారెక్కేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి పీసీసీ చీఫ్ అయ్యే వరకు…బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేసిన ఆయన… 2023 ఎన్నికల ముందు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య ఇద్దరూ దాదాపు రాజకీయ చరమాంకానికి వచ్చారు. వారసులను ముందుపెట్టి తెరవెనక రాజకీయానికి పరిమితం అయ్యే దశకు చేరారు. అందులోనూ ఒక పార్టీకి బద్ద వ్యతిరేకులుగా దశాబ్దాలుగా పోరాడి, చివరికి అవే పార్టీల్లోకి జంప్ అయ్యారు. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా రాజకీయమూ మారాలని సమర్థించుకుంటున్నారు. రాజకీయం అంతేనా…లేదంటే నేతలకు గత్యంతరంలేని పరిస్థితులా…..ఏదేమైనా….ఇద్దరు నాయకుల మధ్య పోలిక సేమ్ టు సేమ్ అంటున్నారు పొలిటికల్ పండితులు.