Off The Record: వై నాట్ 175 మూడ్‌లో ఉన్న వైసీపీ.. టీడీపీ కీలక నియోజకవర్గాలను ఒక్కొక్కటిగా తన టార్గెట్ రేంజ్‌లోకి తీసుకొస్తోంది. కంచుకోటలైనా… ఇంకోటైనా… బద్దలు కొట్టి తీరాల్సిందేనంటోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం లక్ష్యంగా ఓ రేంజ్‌లో పొలిటికల్ వార్ చేస్తున్న అధికార పార్టీ… తాజాగా హిందూపురంను ఫిక్స్ చేసే పని మొదలుపెట్టిందట. ఎప్పట్నుంచో టీడీపీని గెలిపిస్తున్న హిందూపురం ఓటర్లు గత రెండు విడతలుగా సినీ హీరో బాలకృష్ణను అసెంబ్లీకి పంపుతున్నారు. హ్యాట్రిక్ కోసం ప్లాన్ చేసుకుంటున్న బాలయ్యకు చెక్ పెట్టేపని ఆల్రెడీ మొదలైపోయిందట. చూడు…. ఒకవైపే చూడు…. అన్న ఆయన డైలాగ్‌నే రివర్స్ చేసి, చూస్తాం…. రెండో వైపు చూపిస్తాం… అని అంటోందట వైసీపీ అధినాయకత్వం. మిగతా నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా… కుప్పం, హిందూపురంలో గెలిచి బావ బావమరుదులను ఇంటికి పంపాలనుకుంటోందట.
కుప్పం విషయంలో ఇప్పటికే దూకుడుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా హిందూపురం మీద ఫోకస్ ఫోకస్ పెట్టారు. గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా ఉన్నారు పెద్దిరెడ్డి. జిల్లాల విభజన తరువాత రీజనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే హిందూపురంపై ఫోకస్ పెట్టి…వైసీపీలోని గ్రూప్ వార్‌కు చెక్ పెట్టారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను తప్పించి.. కొత్త అభ్యర్థిని రంగంలోకి దించారు. కురుబ కులానికి చెందిన దీపికకు పార్టీ పగ్గాలు ఇచ్చారు. ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గం కావడం.. ఇక్కడ పార్టీకి కలిసొచ్చే ఇంకో అంశం. ఈ నిర్ణయం ద్వారా విబేధాలతో ఉన్న నేతలందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా రెండు బలమైన సామాజిక వర్గాల మద్దతు వచ్చే విధంగా వ్యూహ రచన చేశారు. దీపికకు కొందరు నేతలు సహకరించకున్నా… బ్యాక్‌గ్రౌండ్‌లో వర్కౌట్ చేస్తున్నారట పెద్దిరెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి హిందూపురంలో బాలకృష్ణకు చెక్ పెట్టాలన్నది ఆయన పట్టుదల గా చెబుతున్నారు.
టీడీపీ బలగా ఉందని చెప్పుకునే చలివెందుల గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఉప ఎన్నికలో వైసీపీ గెలిచిందని, తాము లోకల్‌లో బలంగా ఉన్నామని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని అడుగుతున్నారట పెద్దిరెడ్డి. హిందూపురంలో గెలవాలని సీఎం జగన్ కూడా గట్టిగా ఉన్నారని, అవసరమైతే స్వయంగా రెండు మూడు సార్లు ప్రచారం నిర్వహిస్తారని కార్యకర్తలకు భరోసా ఇచ్చారని అంటున్నారు. వర్గాలు వీడి దీపిక విజయం కోసం అంతా పని చేయాల్సిందేనని, అటు కుప్పం, ఇటు హిందూపురం రెండు చోట్ల వియ్యంకులకు గట్టి స్ట్రోక్ ఇవ్వాలని అధినాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చాయట. మరీ ముఖ్యంగా హిందూపురం నేతలంతా విభేదాలు పక్కనపెట్టి పనిచేస్తే… బాలయ్యని ఓడించడం పెద్ద కష్టం కాదని అంటోందట నాయకత్వం. మరి ఎన్నికల టైంకి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.