Off The Record: పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ కమలం పార్టీలో జోష్ తగ్గిపోయింది. 35 శాతం ఓట్లు , 8 ఎంపీ సీట్లు వచ్చినా… ఆ వాతావరణంగాని, ఆ స్థాయి ఉత్సాహంగాని కనిపించడం లేదట పార్టీ శ్రేణుల్లో. ఊపు మీద ఉండాల్సిన పార్టీ కేడర్‌లో నిరాసక్తత పెరిగిపోతోందని అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని, ఏ రోజైనా… కొత్త అధ్యక్షుడు రావచ్చన్న ప్రచారంతో… ఇప్పుడున్న టీమ్ అంత యాక్టివ్‌గా పని చేయకపోవడమే అందుకు కారణమన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం రాష్ర్ట అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డి మరో సారి కేంద్ర మంత్రి కావడం, కీలకమైన బొగ్గు గనులు శాఖను అయనకు కేటాయించడంతో ఆ పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారట. అందుకే ఎక్కువ సమయం ఢిల్లీకి కేటాయించాల్సి వస్తోంది ఆయన. అది చాలదన్నట్టు…మరో వైపు జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ బాధ్యతల్ని కూడా కిషన్‌రెడ్డికే అప్పగించింది పార్టీ అధిష్టానం. అందుకే టైమ్ దొరికితే అటువైపు వెళ్తున్నారాయన.
Read Also: Andhra Pradesh: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన ప్రారంభం..!
గతంలో వారాంతాల్లో రాష్ట్రానికి వచ్చే వారు కిషన్‌రెడ్డి. కానీ… ఇప్పుడు ఆ పరిస్థితే కూడా లేదట. వీకెండ్స్ జమ్ము కాశ్మీర్ ట్రిప్స్ పెట్టుకోవడంతో… తెలంగాణకు చుట్టపు చూపుగానే వస్తున్నారట. రాష్ట్ర అధ్యక్షుడి పరిస్థితే అలా ఉంటే… ఇక పార్టీలో ఉత్సాహం ఏముంటుంది? కేడర్ ఎలా పని చేస్తారన్నది తెలంగాణ బీజేపీ ఇంటర్నల్ టాక్. చివరికి తన సొంత నియోజక వర్గం సికింద్రాబాద్ కు కూడా టైమ్ కేటాయించలేకపోతున్నారట కిషన్‌రెడ్డి. ఇంతకు ముందు లా టైమ్ ఇవ్వలేనని నియోజకవర్గ నేతలకు నేరుగానే చెప్పినట్టు తెలిసింది. ఇక జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయేంత వరకు కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఎక్కువగా వచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు ఇక ఇక్కడ పార్టీ రోజువారీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారన్నది క్వశ్చన్. ఎలాగు కొత్త అధ్యక్షుడు వస్తారు కదా … అని కూడా కిషన్ రెడ్డి కూడా పెద్దగా ఇనిషియేట్ తీసుకోవడం లేదన్నది ఇంకో వాదన. కారణం ఏదైనా… సరైన నాయకత్వం లేక తెలంగాణ బీజేపీలో స్తబ్దత పెరిగిపోతోంది. దీనికి ఇప్పుడే చెక్ పెట్టకుంటే… తర్వాత సెట్ చేయడం కష్టమవుతుందన్న అభిప్రాయం పెరుగుతోంది పార్టీ వర్గాల్లో. అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి మరి.