Off The Record: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి టాక్ ఆఫ్ ది పాలిటిక్స్‌గా మారారు. గతంలో సొంత పార్టీ నేతల మీద, ప్రభుత్వ నిర్ణయాల మీద… సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆరున్నొక్క రాగాన్ని ఆలపించిన వసంత…సీఎం జగన్‌తో భేటీ తర్వాత కాస్త మెత్తబడ్డారని అంతా అనుకున్నారు. కానీ.. ఆయన తాజా చర్య తిరిగి కలకలం రేపుతోందట. తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, దాన్ని కట్టడి చేస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు, ఇతర శాఖల అధికారులకు వసంత లేఖ రాయటంతో… మైలవరం పంచాయితీ మళ్ళీ మొదటికి వచ్చిందా అనే చర్చ పార్టీలో జరుగుతోందట.
ఏ విషయమైనా సరే.. ముక్కుసూటిగా మాట్లాడే వసంత అక్రమ మైనింగ్‌కు పాల్పడే వారు ఎవరు అనే విషయాన్ని నేరుగా ఎందుకు చెప్పటం లేదనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు అక్రమ తవ్వకాలు జరుపుతుంటే దానిపై నేరుగా పేర్లతోనే ఫిర్యాదు చేయవచ్చు కదా.. అని సొంత పార్టీ నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. పేర్లు పెట్టకుండా ఈ తరహాలో ఫిర్యాదు చేయటం ద్వారా అధికార పార్టీ వాళ్లే అక్రమాలకు పాల్పడుతున్నారనే ప్రచారానికి స్వయంగా ఎమ్మెల్యేనే ఆస్కారమిచ్చారని పార్టీ నేతలు అనుకుంటున్నారట. ఇదే సందర్భంలో మరో చర్చ కూడా నడుస్తోందట. వసంత టార్గెట్ ఎవరు, ఎవర్ని ఉద్దేశించి ఈ లేఖ రాశారు అనే అంశం మీదే ఫోకస్ పెరిగిందట. సొంత పార్టీలోని నేతల మీదే వసంత పరోక్షంగా ఫిర్యాదు చేశారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన అదే నియోజక వర్గం వారిపైనా, లేక పక్క జిల్లాకు చెందిన వారెవరైనా ఉన్నారా అంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట ఇతర రాజకీయ పార్టీల నేతలు. మరోవైపు మూడేళ్ళుగా ఈ అక్రమ తవ్వకాలు జరుగుతుంటే సడెన్ గా ఇప్పుడే ఎమ్మెల్యేకు ఎందుకు గుర్తొచ్చాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వసంత ఇప్పుడు ఫిర్యాదు చేయటం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా లేక వ్యక్తిగత అవసరాలా అన్న ఆరాలు కూడా మొదలయ్యాయట.
ఈ మొత్తం వ్యవహారంపై ఎమ్మెల్యే వసంత వర్గీయుల వాదన మరోలా ఉంది. అక్రమ తవ్వకాలపై స్థానిక అధికారులను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూనే ఉన్నారని చెబుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే బహిరంగంగా ఫిర్యాదులు చేస్తే.. విమర్శలు వస్తాయన్న ఉద్దేశ్యంతో ఇన్నాళ్ళు ఎమ్మెల్యే ఆగారని చెబుతున్నారట. అయితే వ్యవహారం శృతిమించి చివరికి వసంత కృష్ణప్రసాదే అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారనే విమర్శలు రావటంతో స్వయంగా ఆయనే లేఖరాశారని చెబుతున్నారట అనుచరులు . మరి వసంత లేఖ చివరికి ఎవరికి ఇబ్బందులు తెస్తుందో చుడాలి.