Off The Record: నథింగ్ ఈజ్ పర్మినెంట్.. రాజకీయాల్లో తరచు వినిపించే మాట ఇది. కొత్త తరం నాయకులకు బాగా ఒంటబట్టిన ఈ థియరీని కాస్త ఆలస్యంగా ఆకళింపు చేసుకుంటున్నారు సీనియర్లు. ఈ దిశగా ఇప్పుడు వినిపిస్తున్న పేరు కొణతాల రామకృష్ణ. కాంగ్రెస్ హయాంలో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి. ఉమ్మడి విశాఖజిల్లాలో బలమైన గవర సామాజిక వర్గం ప్రతినిధిగా చెలామణీ అయ్యారాయన. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో పదేళ్ళు పదవుల్లో ఉన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన కొణతాల….కేవలం తొమ్మిది ఓట్లతో గెలిచారు. ఒక ఎంపీ… సింగిల్ డిజిట్ మెజారిటీతో గెలవడం ఇప్పటికీ రికార్డే. అయితే.. గడిచిన మూడు దఫాలుగా… అనకాపల్లిలో స్థానికేతరులు ఎమ్మెల్యే లు అయ్యారు. వివిధ కారణాలతో ఇక్కడ దాడి, కొణతాల కుటుంబాలు బలహీనపడ్డాయి. 2009లో ఓడిపోయినప్పటికీ కొంత కాలం ఆయన హవా నడిచింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు. అప్పట్లో పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం ఉండేది. 2014లో పార్టీ ఓడిపోవడం, విశాఖ ఎంపీ సీటులో ఎదురైన వైఫల్యాలు కొణతాలకు అధినాయకత్వంతో దూరం పెంచాయనేది రాజకీయ ప్రచారం. ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ పక్కన పెట్టేసిన రామకృష్ణ సైలెంట్ అయిపోయారు.
తన శిష్యుడు గండిబాబ్జీ టిక్కెట్టు విషయంలో స్పష్టత రాకపోవడంతో 2017లో బయటకు వచ్చేశారు కొణతాల. ఆ తర్వాత అనేక పరిణామాలు జరగగా ఆయన మాత్రం ఎప్పడు రాజకీయ ఆసక్తిని ప్రదర్శించలేదు. గత ఎన్నికల ముందు టీడీపీ ఆహ్వానం మేరకు చంద్రబాబును కలిశారు. దీంతో మరోసారి ఎంపీగా అనకాపల్లి నుంచి పోటీ చేయడం ఖాయం అనే ప్రచారం జరిగినా అది సాధ్యపడ లేదు. ఇక రాజకీయాలను పక్కన బెట్టి రైతు సమస్యలపై దృష్టి పెట్టారు. చెరకు సాగు ఇబ్బందులు, సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీలు మూత పడటం వంటి వాటిని అజెండాగా పెట్టుకుని వీలున్నప్పు డల్లా నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు రామకృష్ణ.
ఈ పరిస్థితుల్లో ఇటీవల వైసీపీ నుంచి తొలి వికెట్ పడింది. మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు జనసేనకు వెళ్ళాలని ఫిక్సయ్యారు. ఈనెల 20న ఆయన తన అనుచరులతో కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన ప్రచారం బయలు దేరింది. కొణతాల రామకృష్ణ కూడా జనసేనలోకి వెళుతున్నారన్నది ఆ ప్రచారం సారాంశం.గతంలో పవన్ కళ్యాణ్, కొణతాల కలిసి దిగిన ఫోటో బయటికి రావడంతో ఏదో జరుగుతోందనే ఆసక్తి పెరిగిపోతోంది. దీనిపై ఇటు కొణతాల కానీ, అటు జనసేన కానీ ఎటువంటి స్పందన లేదు. మొత్తం మీద పొలిటికల్‌గా రీ ఛార్జ్ అయిన కొణతాల అతి త్వరలోనే జనసేన గూటికి చేరతారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది.