Off The Record: ఉమ్మడి ప్రకాశం రాజకీయాల్లో ఇప్పుడు ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఒంగోలు, కనిగిరి, దర్శిలో రాత్రికి రాత్రే వెలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పొలిటికల్ ప్రకంపనుల రేపుతున్నాయి. ఈ దెబ్బకు ఎప్పుడూ కూల్‌గా ఉండే జిల్లా రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. పలు ప్రధాన సెంటర్లలో తర్వాతి సీఎం జూనియర్ ఎన్టీఆర్, అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అంటూ రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు పెట్టేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కనిగిరి, దర్శి ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో ఫ్లెక్సీలు పెట్టినా వెంటనే గమనించి అప్రమత్తమైన టీడీపీ శ్రేణలు తొలగించేశాయి. ఒంగోలులో మాత్రం కాస్త ఆలస్యం కావటంతో విషయం బయటకు వచ్చింది. జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతున్న టైంలోనే…ఇలా జరగడంతో షాకయ్యారట టీడీపీ నాయకులు. ఇది ఎవరి పనా అంటూ ఆరాలు తీయడం మొదలైంది. పార్టీకి పెరుగుతున్న ఆదరణము చూడలేకే ఈ పని చేసి ఉంటారని అంటున్నారు నాయకులు. ఒంగోలు టౌన్‌లో పెట్టిన ఫ్లెక్సీలన్నిటినీ తొలగించిన టీడీపీ శ్రేణులు… ఆ పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజిని పరిశీలించి అవాక్కయ్యారట. ఇలా కూడా చేస్తున్నా అంటూ చర్చించుకుంటున్నాయి జిల్లా పార్టీ వర్గాలు.
Read Also: Off The Record: కాంగ్రెస్‌లో వైఎస్సాటీపీ విలీనం ఖాయమైనట్టేనా? ఆ టూర్ వెనక ఆంతర్యం ఏంటి?
అర్ధరాత్రి సమయంలో ముసుగులు వేసుకున్న కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తించారు. వారు వచ్చిన వాహనం, వారి ఆనవాళ్లను బట్టి ఎవరు కట్టారో తేల్చేశారట స్థానిక టీడీపీ నాయకులు. ఫ్లెక్సీల కోసం ఫ్రేములు సప్లై చేసిన వ్యక్తి వార్డు వాలంటీర్ అఫ్రిద్ అని నిర్దారించుకున్నారట. అతని దగ్గరికి వెళ్ళి ప్రశ్నించడంతో ఒంగోలు 1వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు ఎడవల్లి సాంబశివరావు ఫ్రేమ్స్ అడిగితే…ఎక్కడ దొరుకుతాయో తాను వారికి అడ్రస్ చెప్పానే తప్ప తనకేమీ సంబంధం లేదని చెప్పాడట వాలంటీర్ అఫ్రిద్. దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు స్థానిక టీడీపీ నాయకులు. లోకేష్ పాదయాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే ఇలా చేశారని ఆరోపిస్తున్నాయి టీడీపీ వర్గాలు. గతంలో చంద్రబాబు సభలు జరిగిన ప్రాంతాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ అంటూ నినాదాలు చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారట.. తెలుగుదేశం పార్టీ ఎక్కడ సభలు పెట్టినా వినిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నినాదాలన్నీ వైసీపీ కుట్రలో భాగమేనా అన్న అనుమానాలు వస్తున్నాయని అంటున్నారట టీడీపీ లీడర్స్. ఐ ప్యాక్ సూచనలు, సలహాలతో జై ఎన్టీఆర్, నెక్స్ట్ సీఎం నినాదాలతో హోరెత్తించి అలజడి రేపాలన్నది అధికార పార్టీ నాయకుల ప్లాన్‌గా అనుమానిస్తున్నారట తెలుగుదేశం నాయకులు.
Read Also: Off The Record: బీజేపీకి జనసేనపై ఉన్న ప్రేమ టీడీపీపై లేదా..? ఎందుకు పిలవలేదు..?
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మొత్తం ఎవరి పనులు వాళ్లు చేసుకున్న టైంలో…. వారిని విభజించటానికి కుట్రలు జరుగుతున్నాయని మాట్లాడుకుంటున్నారట ప్రతిపక్ష నాయకులు. మరోవైపు వైసీపీ మాత్రం ఈ వ్యవహారంతో తమకేం సంభందం లేదన్నట్లుగా ఉందట. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు కూడా బయట వ్యక్తుల నుంచి అద్దెకు తెచ్చుకున్న ఫ్లెక్సీ ఫ్రేములు తిరిగి వారికి అప్పగించామని.. అంతకు మించి తమకు తెలియదంటున్నారట..టీడీపీ ముఖ్యుల కుటుంబ రాజకీయ గొడవల్లో తమ పార్టీని లాగాలని చూస్తున్నారని అంటున్నారు. మరి అసలు జూనియర్ ఎన్టీఆర్ పేరును నెక్ట్స్ సీఎం అంటూ బయటకు తీసుకు వస్తున్నదెవరు.. టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా వైసీపీ నేతలే కావాలని అలా చేస్తున్నారా.. లేక మరో అదృశ్య శక్తి ఏదైనా ఉందా? వాస్తవాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.