Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో వైఎస్సార్ టీపీ విలీనం ఖాయమైనట్టేనా అంటే….కాంగ్రెస్ వర్గాల నుంచి అవునన్న సంకేతాలే వస్తున్నాయట. ఆ పనిమీదే షర్మిల బెంగళూర్ టూర్‌కు వెళ్ళినట్టు చెబుతున్నారు. యూపీఏ మిత్ర పక్షాల మీటింగ్ కోసం పార్టీ పెద్దలంతా బెంగళూర్ వచ్చినందున అక్కడే అన్ని విషయాలు మాట్లాడవచ్చని ఆమె అనుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీలకు మధ్య వర్తిత్వం వహిస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పిలుపుతోనే వెళ్లినట్టు తెలిసింది. బెంగళూర్ వస్తామన్న టి కాంగ్రెస్ నేతలు కొంత మందిని వద్దని చెప్పి మరీ… షర్మిలను పిలవడంపై ఇప్పుడు గాంధీభవన్‌లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.
షర్మిల తన పార్టీని తెలంగాణ కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న చర్చ చాలా రోజుల నుంచి ఉంది. అయితే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండటంతోనే ఆలస్యం అవుతోందన్న వాదన కూడా ఉంది. ఆమె సేవల్ని తెలంగాణకు బదులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఉపయోగించుకోవాలన్న సూచనలు ఇచ్చే వారు సైతం టి కాంగ్రెస్‌లో ఉన్నారు. కానీ… షర్మిల మాత్రం అధిష్టానం పెద్దలతో జరిగిన మాటల్లో తెలంగాణవైపే మొగ్గినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా చేరిక పట్ల కొంత సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. ఆమె రాక ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో ప్లస్ అవుతుందని అధిష్టానానికి ఆయన నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ టీపీ విలీనం దాదాపు ఖాయమైనట్టేనంటున్నాయి టి కాంగ్రెస్ వర్గాలు. మరోవైపు షర్మిల రాకను వ్యతిరేకిస్తున్నవారు మరో వాదనను తెరమీదికి తెస్తున్నారట. 2018 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పనిచేయడమే రాజకీయంగా ఇబ్బంది కలిగించిందని, ఇప్పుడు షర్మిల రూపంలో మరో సమస్య వస్తుందన్న వాదనతో నివేదికలు ఇచ్చారట. అయితే షర్మిలను వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్నట్టు చెబుతున్నారు. దీనికి తోడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన కీలక నేత దీని వెనుక ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కొద్ది రోజుల నుంచి కామ్‌గా ఉన్న షర్మిల వ్యవహారం బెంగళూర్ ఎపిసోడ్‌తో మళ్ళీ తెరమీదికి వచ్చింది. విలీనం దాదాపు ఖాయమైనట్టేనన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నందున తెంలగాణ కాంగ్రెస్‌లో ఆమె సేవల్ని ఎలా ఉపయోగించుకుంటారన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ఎపిసోడ్ పార్టీకి తలనొప్పిగా మారుతుందన్న వాదన మరోవైపు ఉంది. ఈ పరిణామాలు టి కాంగ్రెస్‌లో ఏం మార్పులు తీసుకువస్తాయో చూడాలి.