Off The Record: విభిన్న రాజకీయ వ్యూహాలకు కేరాఫ్‌గా చెప్పుకునే బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం మీద వైసీపీ పట్టు బిగించింది. గత రెండు ఎన్నికల్లోనూ మంచి విజయాలే నమోదు చేసుకుంది. అధికారంలో ఉన్నా.. లేకున్నా… బాపట్ల మాదేనన్నది వైసీపీ నాయకుల ఫీలింగ్. ఇప్పుడే కాదు…అంతకు ముందు కూడా ఇక్కడ టీడీపీ పెద్దగా సక్సెస్ అయింది లేదు. నాడు కాంగ్రెస్, నేడు వైసీపీకి అనుకూలంగా ఉండే సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. 1951లో ఏర్పడిన బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లో లక్షా 84వేల మంది ఓటర్లు ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే… ఎస్సీలు దాదాపు 35వేలు, రెడ్లకు మరో 35 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. ఇంకో 15వేలకు పైగా ముస్లింల ఓట్లు. ఈ ఓట్ బ్యాంక్ మొత్తం సాలిడ్‌గా తమదేన్నది వైసీపీ నాయకుల లెక్క. దీంతో బాపట్లను తమ కంచుకోటగా భావిస్తోందా పార్టీ.
1985లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత ఏడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ పార్టీ అభ్యర్థులు కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ బలహీనమైన క్యాండిడేట్స్‌ను పెట్టడం, ఓట్ల చీలిక ద్వారా మాత్రమే సాధ్యమైంది తప్ప టీడీపీ బలంతో వచ్చిన గెలుపు కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. త్రిముఖ పోటీ గట్టిగా జరిగి ఓట్లు చీలితే తప్ప బాపట్లలో తెలుగుదేశం గెలుపు సాధ్యం కాదన్నది గత ఫలితాలు చెబుతున్న వాస్తవం. ఇప్పుడెలాగూ ఏపీలో కాంగ్రెస్‌కు అంత మేటర్ లేదు కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా ఈ సీటు మాదేనన్న ధీమాగా ఉన్నారు వైసీపీ నాయకులు. అందుకే గ్యారంటీ టిక్కెట్‌లో వారసుల్ని బరిలో దింపి పొలిటికల్ అరంగేట్రం చేయించాలని ఉత్సాహపడుతున్నారట సీనియర్ లీడర్స్. ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు మొదలైపోయినట్టు తెలిసింది.
గతంలో ఎలా ఉన్నా… ఈసారి మాత్రం ఈ సీటును రెడ్లకు ఇవ్వాలన్న డిమాండ్ పార్టీలో పెరుగుతోంది. ఆ క్రమంలోనే మాజీ మంత్రి గాదె వెంకట్‌రెడ్డి కుమారుడు మధుసూదన్‌రెడ్డి ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం జగన్‌కు బంధువైన మరో వారసుడు కూడా ఇటువైపు చూస్తున్నట్టు తెలిసింది. టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఈసారి బాపట్ల బరిలో దిగి అసెంబ్లీలో అధ్యక్షా… అనాలనుకుంటున్నారట. ఇంకోవైపు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీనియార్టీని ముందుకు తెస్తున్నట్టు తెలిసింది. పార్టీలో తాను సూపర్ సీనియర్‌ని కాబట్టి కులాలతో సంబంధం లేకుండా ఆప్షన్ తనకివ్వాలని ఆయన అడుగుతున్నట్టు తెలిసింది. అనకాశం వస్తే… తన కుటుంబ సభ్యుల్లో ఒకర్ని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నారట ఉమ్మారెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఇక్కడ పెద్దగా లేవని, అందుకే ఈసారి ఆయనకు కాకుండా… అయితే రెడ్డి, లేదంటే కాపులకు ఇవ్వాలన్న డిమాండ్ పార్టీలో పెరుగుతున్నట్టు తెలిసింది.
బాపట్ల ఎంపీ సీటు ఎలాగూ ఎస్సీలకు రిజర్వ్‌డ్ కాబట్టి అసెంబ్లీ టిక్కెట్‌ను మిగిలినవాళ్ళలో ఎక్కువ ఓట్లున్న సామాజిక వర్గాలకు ఇస్తే… ఇక తిరుగుండదన్న ఆలోచనతో ఉన్నారట స్థానిక నాయకులు. గతంలోనే బాపట్లను రెడ్లకు ఇవ్వమంటే…ఈ ఒక్కసారికి ఇలా కానీయండి తర్వాత మీకే ఇస్తామని వైసీపీ అధిష్టానం చెప్పిందట. ఆ మేరకు ఈసారి కచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తారని అంచనా వేస్తోంది లోకల్ కేడర్. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత మొదలైందని, అది కూడా తమకు ప్లస్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట బాపట్ల రెడ్డి నాయకులు. ఉందిలే మంచి కాలం అనుకుంటూ…వారసుల్ని బరిలో దింపేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. పార్టీ అధినాయకత్వం మనసులో ఏముందో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.