Off The Record: టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ.. ఆధిపత్యం కోసం కాంగ్రెస్… రాజకీయ ఉనికి కోసం మళ్ళీ తెలుగుదేశంలోకి…. ఆపై ఢిల్లీలో పట్టుకోసం వైసీపీలోకి జంప్. ఇలా కాలమాన పరిస్థితులకు తగ్గట్టు ఎప్పటికప్పుడు వ్యూహాలు, పార్టీలు మారుస్తూ… తన రాజకీయ ఉనికి చాటుకుంటుంటారు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి. ఏ పార్టీలో ఉన్నామన్నదానికంటే…. గెలుపు అవకాశం ఎంతవరకు ఉందన్నదే ఆయన కేలిక్యులేషన్ అని చెప్పుకుంటారు సింహపురి పొలిటికల్ సర్కిల్స్‌లో. దానికి ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఏ పేర్లు పెట్టుకున్నా… ఆయన ఫైనల్ టార్గెట్ మాత్రం గెలుపని అంటారు ఎక్కువ మంది. అలాంటి ఆదాల విజయపరంపరకు 2024 ఎన్నికల్లో బ్రేక్ పడింది. స్వతహాగా కాంట్రాక్టర్… అయిన ప్రభాకర్‌రెడ్డి ఆ లెక్కలతో పాటు పొలిటికల్ కేలిక్యులేషన్స్ కూడా గట్టిగానే వేస్తారన్న అభిప్రాయం ఉంది రాజకీయవర్గాల్లో. ఆ క్రమంలోనే… 2019 ఎన్నికల నామినేషన్‌కు ఒక్కరోజు ముందు టీడీపీ కండువా పక్కనపెట్టేసి… డైరెక్ట్‌గా ఫ్యాన్ కిందికి చేరిపోయారు. అలా… అప్పటి నుంచి వైసీపీలోనే ఉన్న మాజీ ఎంపీకి… ఇటీవల అస్సలు ఫ్యాన్ గాలి పడటం లేదన్న టాక్ నడుస్తోంది. ఫ్యాన్ కింద కూర్చున్నా… ఉక్కపోతగానే ఫీలవుతున్నారట ఆయన. దీంతో.. సార్…. మరోసారి పార్టీ మారేందుకు రెడీ అయిపోయారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట నెల్లూరు రాజకీయవర్గాల్లో.
Read Also: Off The Record: ప్రధాని మోడీ చెప్పినా తెలంగాణ బీజేపీ నేతల్లో మార్పు రాలేదా..?
కొంత కాలంగా వైసీపీలోతనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని మాజీ ఎంపీలో అసహనం పెరిగిపోతున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి…. టీడీపి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది చేతిలో ఓడిపోయారు. మొదట్లో గెలుపు మీద చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించిన ఆదాలకు రూరల్ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఇక ఎన్నికలయ్యాక నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన్ని నియమించిన అధిష్టానం…. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఆనం విజయ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. ఆ పరిస్థితుల్లో… ప్రభాకర్‌రెడ్డి అనుచరులు కొందరు సైకిల్ ఎక్కగా.. మరికొందరు ఇన్ఛార్జ్ ఆనం పంచన చేరారు. దీంతో ఆయన హైదరాబాద్‌కే పరిమితం అయ్యారన్నది కేడర్ వాయిస్. అప్పుడప్పుడు శుభకార్యాలకు వచ్చి ముఖం చూపించి వెళ్తున్నారట. ఈ వ్యవహారం అలా కొనసాగుతుండగానే… ఇటీవల అహోబిలం మఠం భూమి వివాదం ఆదాలను చుట్టుకుంది. తమ భూమిని మాజీ ఎంపీ ఆక్రమించారని ఆరోపించారు మఠం నిర్వాహకులు. ఆ ఎపిసోడ్‌లో పార్టీ తరపున ఎవ్వరూ ఆదాలకు మద్దతుగా మాట్లాడలేదట. అది ఆయన సొంత వ్యవహారం…. మాకేం సంబంధం అన్నట్టుగా నెల్లూరు వైసీపీ నేతలు ఉండటంతో… మరో గత్యంతరం లేక చివరికి ఆయనే ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందంటున్నారు. ఆ వ్యవహారంతో గట్టిగా హర్ట్ అయిపోయారట ప్రభాకర్‌రెడ్డి. అసలే… ఎన్నికల సమయం నుంచి అధిష్టానం తీరు మీద అసహనంతో ఉన్న ఆదాల మఠం భూముల ఎపిసోడ్‌తో మానసికంగా పార్టీకి బాగా దూరం అయినట్టు చెప్పుకుంటున్నారు. గతంలో… చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా వైసీపీలోని కొందరు ఇబ్బంది పెట్టారట.
Read Also: Tanya : కెమెరామెన్ తో హీరోయిన్ ఎంగేజ్ మెంట్..
ఓటమి తర్వాత అధిష్టానం పట్టించుకోకపోవడం, జిల్లా కార్యక్రమాలకు పార్టీ ఆఫీస్ నుంచి కనీస సమాచారం ఇవ్వకపోవడం లాంటి పరిణామాలతో అసంతృప్తిగా ఉన్న ఆదాల పార్టీ మారతారానే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల జగన్ నుంచి పిలుపు వచ్చినా ఆయన వెళ్లలేదట. దీంతో ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని నెల్లూరు మాగుంట లే అవుట్‌లో ఒకటే గుసగుసలు. మాజీ ఎంపీ ఈసారి కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంచనా వేస్తుంటే…. ప్రత్యర్ది వర్గం మాత్రం వేరేలా రెస్పాండ్ అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు అంత సీన్ లేదని, వైసీపీ అధిష్టానాన్ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసేందుకే పార్టీ మారుతున్నట్టు ఆయనే ఆదాల ప్రచారం చేయించుకుంటున్నారన్నది ప్రత్యర్థుల మాట. అటు ఆదాల మూవ్‌మెంట్స్ మాత్రం హైదరాబాద్ టు ఢిల్లీ అన్నట్టుగా ఉండటంతో… పార్టీ మార్పు మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఫైనల్‌గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా చూస్తున్నాయి నెల్లూరు రాజకీయవర్గాలు.