Off The Record: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతోంది బీజేపీ. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక… ఫస్ట్ టాస్క్ కాబట్టి… ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారట. అందుకే జిల్లాల పర్యటనలు మొదలుపెట్టినట్టు సమాచారం. మండల పార్టీ అధ్యక్షులకు వర్క్‌షాప్స్ పేరుతో పార్టీని సంస్థాగతంగా, రాజకీయంగా బలోపేతం చేసేందుకు శిక్షణ ఇస్తున్నారు. అయినా సరే…. పార్టీలో ఏదో… వెలితి కనిపిస్తూనే ఉందట. కారణం ఏంటంటే… నేతలు ఐక్యతా రాగం వినిపించడం లేదన్నది సమాధానం. ఎవరికి వాళ్ళు స్థానికంగా ఏదో… చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్టుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నారు తప్ప…. పార్టీ లైన్‌లో మాత్రం యాక్టివ్‌గా ముందుకు పోవడం లేదని చెప్పుకుంటున్నారు. రాష్ర్ట పార్టీ కార్యక్రమాలకు కూడా ఉత్సాహంగా హాజరవడం లేదు. అదే సమయంలో ఇక కొత్త- పాత అన్నది లేదు, అసలా చర్చను వదిలి పెట్టాలని, అందరూ పార్టీ నాయకులు, కార్యకర్తలే అని చెప్పినా… అది మాత్రం జరగడంలేదు. దీంతో మమ్మల్ని ఇంకెప్పుడు కలుపుకుని పోతారు? మేం ఎప్పటికీ కొత్త వాళ్ళమేనా అన్నది ఓ వర్గం క్వశ్చన్. మరోవైపు ఢిల్లీ పెద్దలు మాత్రం… పార్టీ కోసం అందరూ ఒక్క తాటిపైకి రావాలని పిలుపునిస్తున్నారు.
Read Also: Digital Micro Finance: డిజిటల్ మైక్రోఫైనాన్స్.. 500 మంది రోడ్డుపాలు..!
ప్రధాని మోడీ అయితే… ఒక దశలో రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను పిలిచి ఉతికి ఆరేశారు. అధికారంలోకి రావాలన్న కసిగా పని చేయండని చెప్పారు. 2023లో అధికారంలోకి వచ్చేవాళ్ళమని, మీరే చే జేతులా పోగొట్టారని కూడా అప్పట్లో సీరియస్ అయ్యారట ప్రధాని. అయినా సరే.. ఆ తర్వాత కూడా తెలంగాణ కమలం నేతల్లో పెద్దగా మార్పు రాలేదన్నది పార్టీ వర్గాల మాట. ఎన్నడూ కలిసి పనిచేసింది లేదు. కానీ…ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తున్నాయి. అంతా కలిసికట్టుగా పని చేస్తే పార్టీకి మంచి ఫలితాలు వస్తాయన్న అంచనాలున్నాయి. ఆ విషయాన్నే…. పార్టీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌లో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గట్టిగా చెప్పారట. పక్షపాతం విడనాడాలని స్పష్టం చేశారట ఆయన. కలిసి పని చేయాలని, పనిలో అందరికీ భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం. తమకు సరైన అవకాశం ఇవ్వడం లేదని, పనులు అప్పగించడం లేదన్న అభిప్రాయం చాలా మంది ప్రజాప్రతినిధుల్లో ఉందట. ఇంత చెబుతున్నారు కాబట్టి… ఇప్పటికైనా…అందర్నీ ఇన్వాల్వ్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది బీజేపీ వర్గాల్లో. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కార్యకర్తలు కదలాలంటే… ముందు నాయకులు అడుగేయాలని, కలిసి కట్టుగా పని చేయాలని అంటున్నారు. అంతవరకు బాగానే ఉందిగానీ… ఇప్పుడు అందరిదీ ఒకటే డౌట్ అట. మోడీ చెప్పినా… మారని నాయకులు…. ఇప్పుడు బన్సల్ మాటవిని ఒక్కటవుతారా… తలోవైపు విరిసి ఉన్న కమలం రెక్కలు మళ్లీ సెట్ అవుతాయా అన్న అనుమానాలు ఉన్నాయి పార్టీ వర్గాల్లో. కొత్త అధ్యక్షుడు ఎవరెవర్ని, ఎంత మేరకు కలుపుతాడో చూడాలి మరి.