*కామారెడ్డిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్
కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కామారెడ్డి జిల్లా జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ కవిత, సుభాష్ రెడ్డిలతో సీఎం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కామారెడ్డిలో తమతో కలిసి పని చేయాలనీ సుభాష్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. కామారెడ్డి నియోజకవర్గంలో 6 కోట్ల సొంత నిధులతో సుభాష్ రెడ్డి పాఠశాలను నిర్మించారు. సుభాష్ రెడ్డి సేవలు రాజకీయాల్లో అవసరమని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ విషయంపై సుభాష్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్నందున కామారెడ్డి నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. ప్రతిపక్షాలు కూడా ఈ నియోజకవర్గంపై ఫోకస్ చేశాయి. కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి మున్సిపాలిటీతో పాటు భిక్కనూర్, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, పల్వంచ మండలాలు రామారెడ్డి, రాజంపేటలోని కొన్ని గ్రామాలు వస్తాయి. అయితే ఈ నియోజకవర్గంలో మూడు పర్యాయాలుగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బీఆర్‌ఎస్ పార్టీ తరపున గెలుపొందారు. వరుసగా 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. కేసీఆర్‌ను కామారెడ్డిలోను ఓడించేందుకు ఈ రెండు ప్రధాన ప్రతిపక్షాల అధిష్ఠానం దృష్టి సారించి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
*మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం
తెలంగాణలో ఎన్నికల వేళ ఆయా పార్టీలు బరిలోకి దించే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. దీంతో.. మునుగోడు కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. తనకు మునుగోడు టికెట్ రాకపోవడంతో కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు పీసీసీ కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి. భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చలమల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో ముసలోల్లదే నడుస్తుందని, తనకు టికెట్ రాకుండా నల్గొండ పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాల్వాయి స్రవంతి అడ్డుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ పార్టీ కి క్యాన్సర్ లాంటి వాళ్ళు కోమటి రెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి వర్గం కాబట్టి జిల్లా సీనియర్లు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. టికెట్ సర్వే ఆధారంగా వస్తంది అనుకున్న. కాంగ్రెస్ పార్టీ లో ఎదగాలంటే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ లు పెట్టాలి. ఢిల్లీ నాయకుల కాళ్ళు మొక్కాలి. నాయకులకు మొక్కులు చెల్లించాలి. 15 నెలల కింద కాంగ్రెస్ జెండా కింద పడేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ లో వుండి బిజెపి కి ఓట్లు వేయించింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వెంకట్ రెడ్డి కుళ్ళు రాజకీయం వల్లనే నాకు టికెట్ రాలేదు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే వెంకట్ రెడ్డి కూడా బీజేపీ పార్టీ లోకి వెళ్ళేవాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో మంది నాయకులను రోడ్డు పై పడేసి వాళ్ళ రక్తం తాగుతున్నాడు. వాళ్ళ డబ్బుల తో దానధర్మాలు చేస్తున్నావ్. మీకు, మీ కుటుంబ సభ్యులకు రెండేసి టిక్కెట్లు కావాలి.. వేరే వాళ్ళు మీముందు ఎదగవద్దు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తల పై కేసులు పెట్టించిన చరిత్ర రాజగోపాల్ రెడ్డిది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పెద్దలకు చెబుతున్న ఇప్పటికైనా మీ సీట్లను త్యాగం చేసి బీసీ నాయకులకు టిక్కెట్లు ఇవ్వండి. మొదటి జాబితాలో మొదటి పేరు వున్న నన్ను ఇప్పుడు పేరు లేకుండా చేశారు. సేవ్ మునుగోడు నినాదంతో ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తాను.’ అని చలమల కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
*చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఏపీలో మూతపడ్డ ఆలయాలు..
పాక్షిక చంద్రగ్రహణంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు మూతపడ్డాయి. ఇవాళ ఏపీలోని అన్ని ఆలయాల తలుపులు మూసివేశారు. దాదాపు 8 గంటల పాటు ఆలయాల తలుపులు మూసి ఉంచనున్నారు. అలాగే రేపు తెల్లవారు జాము నుంచి సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఇక, చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. తిరిగి రేపు వేకువజామున 3:15 గంటలకు ఆలయ తలుపులను అర్చకులు తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేసాం.. రేపు ఉదయం ఆలయ తలుపులు తెరిచి శుద్ది చేస్తారు.. సుప్రభాతం ఏకాంతంగా నిర్వహించి.. తోమాల, అర్చన సమయంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నాని చెప్పారు. ఇవాళ 42 వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించామని ఆలయ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అలాగే, చంద్రగ్రహణం వల్ల నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేశారు. శ్రీస్వామి అమ్మవారి ఉభయ ఆలయాలు, పరివార ఆలయాలను బంద్ చేశారు. రేపు తెల్లవారుజామున 5 గంటలకు అర్చకులు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేయనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనానికి ఆర్జిత సేవలకు అనుమతించనున్నారు. ఈరోజు సాయంత్రం, రాత్రి జరిగే ఆర్జిత సేవ, శ్రీస్వామి అమ్మవారి కళ్యాణం నిలుపివేశారు. రాత్రి భక్తులకు అందించే అల్పాహారం కూడా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఇక, రాహుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణము కారణంగా ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము కూడా చంద్రగ్రహణంతో మూసివేశారు. ఆగమశాస్త్ర ప్రకారము అమ్మవారి ప్రధానాలయం, ఇతర ఉప ఆలయముల కవాట బంధనం.. అమ్మవారికి పంచ హారతులను నిలిపి వేసి అర్చకులు కవాట బంధనం చేశారు. గ్రహణం అనంతరం రేపు ఉదయం వేకువజామున 3 గంటలకు అమ్మవారి ప్రధానాలయము, ఉప ఆలయముల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకములు చేయనున్నారు. రేపు ఉదయం9 గంటలకు ప్రతీ నిత్యము వలనే భక్తులకు దర్శనము పునః ప్రారంభించి ఆర్జిత సేవలు నిర్వహణ చేస్తారు. రేపు తెల్లవారుఝామున నిర్వహించు ఆర్జిత సేవలు, సుప్రభాతం, వస్త్రం సేవ మరియు ఖడ్గమలార్చనను నిలిపివేశారు. ఆ తర్వాత ప్రారంభమగు అన్ని ఆర్జిత సేవలు యధావిధిగా జరుగుతాయని ఆలయాధికారులు తెలిపారు.
*గాడిదపై వచ్చి నామినేషన్.. ఎన్నికల సిత్రాలు..
5 రాష్ట్రాల ఎన్నికలకు కొన్ని రోజులే సమయం ఉంది. వచ్చే నెలలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. 2024 లోకసభ ఎన్నికల ముందు వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరి దృష్టి వీటిపై కేంద్రీకృతమయ్యాయి. ఇదిలా ఉంటే ప్రజల్ని ఆకట్టుకునేందుకు, వార్తల్లో ఉండేందుకు కొంతమంది అభ్యర్థులు వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనామినేషన్ల దాఖలుకు మరికొన్ని రోజులే మిగి ఉంటటంతో అభ్యర్థుల హడావుడి ప్రారంభమైూంది. అయితే కొందరు అభ్యర్థులు మాత్రం నామినేషన్ సెంటర్లకు చేరుకోవడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. మధ్యప్రదేశ్ బుర్హాన్ పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రియాంక్ ఠాకూర్ నామినేషన్ సమర్పించేందుకు ‘గాడిద’పై ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు. అన్ని రాజకీయ పార్టీలు ఆశ్రిత పక్షపాతానికి గురవుతున్నాయి, ప్రజలను గాడిదలుగా మారుస్తున్నారని సింబాలిక్ గా చెప్పేందుకు ఇలా నామినేషన్ వేశానని చెప్పారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర సింగ్ షేరా భయ్యా ఎద్దుల బండిపై వచ్చి నామినేషన్ వేశారు. సాన్వేర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రీన బోరాసి సాన్వెర్ ట్రాక్టర్ పై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. నరేలా అసెంబ్లీకి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విశ్వాస్ సారంగ్ స్కూటర్ పై వచ్చి నామినేషన్ వేశారు. మధ్యప్రదేశ్‌లో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 30, పరిశీలన అక్టోబర్ 31న జరుగుతుంది. అభ్యర్థిత్వ ఉపసంహరణకు నవంబర్ 2 చివరి తేదీ. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి
*బీజేపీ రైతుల రుణాలని మాఫీ చేయదు..కానీ అదానీ రుణాలను మాఫీ చేస్తుంది..
ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ప్రజలపై హమీల వర్షం కురిపించారు. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్గడ్ లో కూడా ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ రోజు కాంకేర్ జిల్లాలోని భానుప్రతాప్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేస్తామని శనివారం హమీ ఇచ్చారు. ప్రధాని మోడీ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ వాళ్లు రైతుల రుణమాఫీ చేయరు కానీ, అదానీ రుణాన్ని మాత్రం మాఫీ చేయగలుగుతారని దుయ్యబట్టారు. గతంలో రైతుల రుణమాఫీ చేశాం, ఛత్తీస్గడ్ లో రైతులు రుణాలను మరోసారి మాఫీ చేస్తామని అన్నారు. ప్రతీ బ్యాంక్ అకౌంట్ లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు చేయలేదు, కానీ నేను తప్పుడు వాగ్దానాలు చేయను, చెప్పినవి చేసిచూపిస్తానని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మా ప్రభుత్వం రైతులు, కార్మికులకు, పేదలకు సాయం చేస్తుంటే, బీజేపీ అదానీకి సాయం చేస్తుందని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో రైతుల రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా, పాఠశాలలు మరియు కళాశాలలకు ఉచిత విద్యను కూడా గాంధీ హామీ ఇచ్చారు. ఛత్తీస్ గడ్ లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు. బీజేపీ బీసీ కులగణనకు ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన నిర్వహిస్తామని చెప్పారు. 90 మంది ప్రభుత్వ కార్యదర్శుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీ వర్గానికి చెందిన వారున్నారని, ఓబీసీల కోసం కేంద్రం 5 శాతం మాత్రమే ఖర్చు పెడుతోందని ఆరోపించారు.
*ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాలు ఢీకొని 35 మంది దుర్మరణం
ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో 35 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వాడీ అల్ నట్రూన్ సమీపంలో కైరో-అలెగ్జాండ్రియా డెజర్ట్ రహదారిపై ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో చెలరేగిన మంటల కారణంగా మరణించినవారిలో 18 మంది కాలిబూడిదయ్యారు. 53 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. హైవేపై మూడు ప్యాసింజర్ బస్సులు, 10 కార్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారు నుంచి ఆయిల్ లీక్ అయింది. ఇది మంటలను ఏర్పడటానికి కారణమైంది. ఈ మంటలు తర్వాత వాహనాలకు కూడా వ్యాపించాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే స్థానిక అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
*8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఉరిశిక్ష.. ప్లాన్ ప్రకారమే ఇరికించిన పాకిస్తాన్, ఖతార్.?
ఖతార్ దేశంలో 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేసి, ఎలాంటి వివరాలు వెల్లడించకుండా ఉరిశిక్ష విధించడంపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఖతార్ లోని సాయుధ బలగాలకు శిక్షణ, ఇతర సహాయ సహకారాలు అందించే దహ్ర గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు. అయితే ఈ కేసులో ఈ సంస్థ యజమానిని అరెస్ట్ చేసిందా, కొన్ని రోజులకే క్షమాభిక్షపై వదిలేసింది. కానీ 8 మంది భారతీయులకు మాత్రం శిక్ష విధించడం అనుమానాలకు తావిస్తోంది. ఇజ్రాయిల్ తరుపున ఖతార్ దేశంలో భారతీయులు గూఢచర్యం చేయాల్సిన అవసరం ఏముంటుందనే అంతర్జాతీయ సంబంధాల నిపుణులు చెబుతున్నారు. ఖతార్ లో పాలన, పోలీస్, కోర్టులు అన్నీ కూడా రాచకుటుంబం ఆధీనంలోనే ఉండటం వల్ల సాక్ష్యాలకు విలువ లేకుండా పోయిందనే వాదనలు ఉన్నాయి. భారత నావీ మాజీ అధికారులను కుట్ర ప్రకారమే పాకిస్తాన్-ఖతార్ కలిసి ఇరికించినట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ కావాలనే ఫేక్ సమాచారాన్ని సృష్టించి వీరిని ఈ కేసులో ఇరికించిందని అనుమానిస్తున్నారు. గత ఏడాది పాక్ ఆర్మీ అధికారులు, ఖతార్ లోని ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశం నిర్వహించారు. ఇందులో ఒకరు తీర్పును ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే వచ్చారు. దీంతో ఈ అంశంలో పాక్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 12న ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ ఖతార్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ సేలం బిన్ హమద్ అల్ నబిత్ ని కలిశారు. రక్షణ సంబంధాలు పటిష్టం చేసుకోవడంపై చర్చించినట్లు చెబుతున్నప్పటికీ, భారతీయులపై కుట్ర చేసేందుకే సమావేశమయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
*మహిళా రిపోర్టర్‌పై చేయేసిన మళయాళ స్టార్ హీరో.. చివరకు..
మళయాల స్టార్ హీరో కమ్ పొలిటిషయన్ సురేష్ గోపి వివాదంలో చిక్కుకున్నారు. కేరళలోని కోజికోడ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(కేయూడబ్ల్యూజే) అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ నాయకుడిగా ఉన్న సురేష్ గోపి తన ఎడమ చేతిని మహిళా జర్నలిస్ట్ భుజంపై వేశాడు. కేరళలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూగా గెలవకపోవడంపై సురేష్ గోపిని సదరు విలేకరి ప్రశ్నించారు. “లెట్ మి గివ్ ఎ ట్రై డియర్. లెట్స్ వెయిట్” అని ఆమె భుజం మీద చేయి వేసి ఆమెకి బదులిచ్చాడు. దీంతో రచ్చ మొదలైందిన సురేష్ గోపిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జర్నలిస్ట్ అసోసియేషన్ చెప్పింది. వెంటనే మహిళకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారం కేరళలో సంచలనంగా మారడంతో సురేష్ గోపి ఫేస్‌బుక్ వేదికగా సదరు మహిళా జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు. తాను జర్నలిస్టును ఆప్యాయంగా పలకరించానని, జీవితంలో నేనెప్పుడు బహిరంగంగా, మరేవిధంగా అనుచితంగా ప్రవర్తించలేదని, ఆమెకు బాధ, మానసిక క్షోభ కలిగితే క్షమాపణలు కోరుతున్నా, క్షమించండి, ఒక తండ్రిగా క్షమాపణలు చెబుతున్నా అంటూ ఆయన మళయాలంలో పోస్ట్ చేశారు. రాజ్యసభ మాజీ ఎంపీ అయిన గోపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ స్థానంపై బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. నటుడిగా మారిన రాజకీయ నాయకుడు 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో త్రిసూర్ స్థానం నుండి పోటీ చేశాడు, కానీ రెండుసార్లు విఫలమయ్యాడు. అప్పటి నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి తన పార్టీని గెలిపించేలా కృషి చేస్తున్నారు.
*ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా విజయం.. 5 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై గెలుపు
ఉత్కంఠభరిత పోరులో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది. చివర్లో జిమ్మీ నీషమ్ (58) దూకుడుగా ఆడినప్పటికీ చివరి ఓవరల్ రనౌట్ రూపంలో వెనుతిరిగాడు. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 383/9 పరుగులు చేసింది. అటు న్యూజిలాండ్ జట్టులో రచిన్ రవీంద్ర (116) సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత డేరిల్ మిచెల్ (54), టామ్ లాథమ్ (21), విల్ యంగ్ (32) పరుగులు చేశారు. ఇక ఆసీస్ బౌలింగ్ లో ఆడం జంపా 3 వికెట్లు తీయగా.. జోష్ హేజిల్ ఉడ్, ప్యాట్ కమిన్స్ తలో రెండు వికెట్లు తీశారు. మ్యాక్స్ వెల్ ఒక వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 388/10 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(81), ట్రేవిస్ హెడ్ (109) పరుగులు చేసి మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ (36), స్మిత్ (18), లంబుషేన్ (18), మ్యాక్స్ వెల్ (41), ఇంగ్లీస్ (38), కమ్మిన్స్ 37 పరుగులు చేశారు. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో అందరూ రాణించడంతో న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ ను ఉంచారు. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ లో బౌల్ట్, ఫిలిప్స్ 3 వికెట్లు తీశారు. సాంథ్నర్ 2 వికెట్లు తీయగా.. హెన్రీ, నీష్ తలో వికెట్ సాధించారు. ఎట్టకేలకు ఆస్ట్రేలియా జట్టు వరుసగా 4 మ్యాచ్ ల్లో గెలవగా.. న్యూజిలాండ్ బ్యాక్ టు బ్యాక్ రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.