కేశవానంద భారతి కేసుకి 50 ఏళ్ళు
రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు అధికార పరిమితులపై సుప్రీంకోర్టు ప్రాథమిక నిర్మాణం సిద్ధాంతాన్ని నిర్దేశించిన కేశవానంద భారతిలోని సెమినల్ తీర్పు సోమవారంతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దశాబ్దాలుగా ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం పదేపదే విమర్శించబడింది. భూపరిమితిని విధిస్తూ కేరళ ప్రభుత్వం చేసిన భూసంస్కరణల చట్టాన్ని ఆధ్యాత్మికవేత్త కేశవానంద భారతి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎం సిక్రీ నేతృత్వంలో 13 మంది న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారించింది. 1972 అక్టోబర్ 31న విచారణ ప్రారంభం కాగా 1973 ఏప్రిల్ 24న 7:6 మెజారిటీతో ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థ వంటి రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలను, రాజ్యాంగ మౌళిక స్వరూపాన్ని పార్లమెంటు సవరించలేదని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజ్యాంగ మౌళిక స్వరూపానికి సుప్రీంకోర్టు సంరక్షణదారుగా ఉంటుందని పేర్కొంది. సుప్రీం కోర్టు చరిత్రలోనే మొదటిసారిగా ఈ కేసు విచారణ కోసం 13మంది న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. 1973 నాటి ఈ కేసులో తీర్పు కూడా చాలా స్వల్ప మెజారిటీ 7:6తో వెలువడింది. రాజ్యాంగంలోని కీలకమైన అంశాలు వేటినైనా మార్చేందుకు పార్లమెంట్ తన విశేషాధికారాన్ని ఉపయోగించలేదని కేశవానంద భారతి కేసులో తీర్పు స్పష్టం చేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన వెబ్‌పేజ్‌లో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వాదోపవాదాలు, పిటిషన్లు, తీర్పులు అన్నీ వుంటాయని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ప్రకటించారు. ఆ తీర్పునకు సంబంధించిన రాతప్రతులు, ఇతర సమాచారంతో ప్రత్యేక వెబ్‌పేజ్‌ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.
సూడాన్ లో కాల్పుల విరమణకు అంగీకారం
సూడాన్‌లో పోరాడుతున్న జనరల్స్ మూడు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించారు. 10 రోజులు కొనసాగుతున్న పోరాటంలో వందల మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. విదేశీయుల సామూహిక వలసలను ప్రేరేపించింది. ఇద్దరు జనరల్స్ మధ్య వివాదం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 427 మంది మరణించారు. 3,700 మందికి పైగా గాయపడ్డారు. గత 48 గంటలుగా జరిగిన తీవ్రమైన చర్చల తరువాత, సుడానీస్ సాయుధ బలగాలు (SAF), ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుండి 72 గంటల పాటు దేశవ్యాప్త కాల్పుల విరమణను అమలు చేయడానికి అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. రాజధాని ఖార్టూమ్ సహా దేశంలోని ఇతర చోట్ల యుద్ధాలు చేసిన ప్రత్యర్థుల మధ్య పోరాటం తరువాత సుడాన్ అగాధం అంచున ఉందని UN చీఫ్ హెచ్చరించిన తర్వాత ఇది జరిగింది.సుడాన్‌లో సైన్యం ప్రధానమంత్రి అబ్దల్లా హమ్‌డోక్ యొక్క ప్రభుత్వాన్ని తొలగించి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అనంతరం ఈ రెండు దళాలకు చెందిన నేతల మధ్య విభేదాలు ఈ సంక్షోభానికి కారణం అయ్యాయి. ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య తీవ్ర విభేదాలు, ఈ రెండు భద్రతా బలగాల మధ్య సూడాన్ దేశం రావణకాష్టంగా మారింది. దేశ సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భాగంగా పోరాటం జరిగింది. రాజధాని ఖార్టూమ్, దాని పరిసరాలలో సూడాన్ సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య పోరు చెలరేగింది. దీంతో సూడాన్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారు.
రాష్ట్రంలో సైబర్ తప్ప అన్ని నేరాలు తగ్గాయి: డీజీపీ
రాష్ట్రంలో సైబర్ నేరాల మినహా అన్ని రకాల నేరాలలో పూర్తిగా తగ్గుదలలో ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ గణనీయంగా పెరగడంతో పాటు సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో క్రైమ్, ఫంక్షనల్ వర్టికల్స్‌లపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఐడీ అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్, రేంజ్ ఐజీలు చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు గురైన వారు అందించే ప్రతీ ఫిర్యాదుపై కేసును నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేరాల నమోదు నిర్దారిత ప్రమాణాలలోనే ఉన్నాయని, వ్యక్తిగత నేరాల మినహా మిగిలిన నేరాలన్నింటిలోనూ తగ్గుదల ఉందని తెలిపారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజా మన్ననలు పొందేలా ముందుకు సాగాలన్నారు. పెరిగిపోతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా తెలంగాణ పోలీసుల గౌరవం మరింత ఇనుమడించేలా పని చేయాలని సూచించారు. ముఖ్యంగా నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సీసీటీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్‌లో సీసీ కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అన్ని జిల్లాల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
ఆ రెండు పార్టీలకు విరాళాల వెల్లువ
రాజకీయపార్టీలకు విరాళాలు సునామీలా వచ్చిపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు 2021-2022లో భారీగా విరాళాలు వచ్చాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. దేశంలోని 26 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాలతో పోలిస్తే 2021-22లో టీఆర్ఎస్ అగ్రస్థానంలో ఉండగా, వైసీపీ ఐదో స్థానంలో ఉంది. టీఆర్ఎస్ కు రూ.40.90 కోట్లు, వైసీపీకి రూ.20 కోట్లు వచ్చి నట్టు ఎన్నికల సంస్కరణల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. 2020-21తో పోలిస్తే ఆ మరుసటి సంవత్సరం ఈ రెండు పార్టీలకు ఎక్కువగా విరాళాలు వచ్చినట్టు పేర్కొంది. 2021-22లో వచ్చిన విరాళాలపై ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను ఏడీఆర్ సోమవారం వెల్లడించింది. దేశంలోని 26 ప్రాంతీయ పార్టీలకు మొత్తం 189 కోట్లు విరాళాలు రాగా.. అందులో 85.46 శాతం అంటే 162.21 కోట్లు టీఆర్ఎస్, ఆప్, జేడీయూ, ఎస్పీ, వైసీపీకే వచ్చాయి. 20 వేలలోపు, అంతకంటే ఎక్కువ విరాళాల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. ఈ మొత్తం విరాళాల్లో రూ.7.40 లక్షలు మాత్రమే (0.039 శాతం) నగదు రూపంలో వచ్చింది. టీఆర్ఎస్ కు కేవలం 14 విరాళాల్లో 40.90 కోట్ల రూపాయలు వచ్చాయి. 2020-21లో కంటే 2021-22లో వైసీపీకి 8,00,300 శాతం విరాళాలు ఎక్కువగా వచ్చాయి.
నేటి నుంచి ఆర్టిజన్స్ నిరవధిక సమ్మె
వేతన సవరణతో దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. ఆర్టిజన్లకు ప్రాతినిథ్యం వహించే తెలంగాణ విద్యుత్తు ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్-82)తో పాటు ఇత్తెహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు రెండు సంఘాలు మద్దతు తెలుపుతుండగా.. కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ సంఘాల ప్రతినిధులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే విద్యుత్తు సంస్థల్లో సమ్మెలను నిషేధిస్తూ ఎస్మా-1971 ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. సమ్మెలో పాల్గొనే, సమ్మెకు ప్రేరేపించే వారిని సీఆర్‌పీసీ-1973లోని సెక్షన్-107ను అనుసరించి బైండోవర్ చేయాలని యాజమాన్యం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. విద్యుత్తు సంస్థల్లో రెగ్యులర్ ఉద్యోగుల కన్నా ఆర్టిజన్ల సంఖ్యే ఎక్కువగా ఉండడం గమనార్హం. దక్షిణ డిస్కమ్(ఎస్పీడీసీఎల్)లో 10,200 మంది దాకా ఉండగా… ఉత్తర డిస్కమ్(ఎన్పీడీసీఎల్)లో 4,270 మంది, ట్రాన్స్‌కోలో 4,405 మంది, జెన్‌కోలో 3,650 మంది కలిపి దాదాపు 22,525 మంది దాకా ఆర్టిజన్లు పనిచేస్తున్నారు. విద్యుత్తు సంస్థల్లో పనిచేసేవారిలో 60 శాతానికి పైగా వీరే ఉన్నారు.
ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీకి బీఆర్‌ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలు జరగనున్నాయి. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులను కార్యోణ్ముఖులను చేయాలని, ఎన్నికల శంఖారావంలా ఈ సభలు నిర్వహించాలని పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ గులాబీ శ్రేణులకు సూచించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ సభల్లో తెలంగాణ సాధించిన విజయాలపై, బీజేపీ వైఫల్యాలపై తీర్మానాలు చేయనుంది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది నేటి సభల్లో పాల్గొననున్నారు. ఉదయమే నగరం, పట్టణం, గ్రామమంతటా పార్టీ జెండాలను ఎగరేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతినిధుల సభలో కనీసం ఆరు అంశాలపై తీర్మానాలు చేయాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. రాష్ట్ర, జాతీయ పరిస్థితులపై తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించిన అనంతరం ఆమోదించనున్నారు. అక్టోబర్ 10న వరంగల్‌లో మహాసభను నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
పచ్చబొట్టు చెరిగిపోదులే.. ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి నిరసన
ప్రేమించానని వెంటపడి.. తీరా ఓకే అన్నాక.. పెళ్లికి మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రేమ బాధితురాలు న్యాయ పోరాటం చేపట్టింది. ప్రేమ పేరుతో వెంటపడి.. సరే నన్నాక.. ఆరేళ్లకుపైగా కాలం కలసి మెలసి తిరిగి ఆ తర్వాత మొహం చాటేశాడని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రియుడితో పెళ్లి జరిపించే వరకు కదిలేది లేదంటూ ఏకంగా ప్రియుడి ఇంటి ముందే నిరసన పోరాటం ప్రారంభించింది. ప్రేమించి పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు న్యాయపోరాటానికి దిగింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తూజాల్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తూజాల్ పూర్ గ్రామానికి చెందిన నాగరాజు గౌడ్, దోమకొండకు చెందిన మౌనికకు డిగ్రీ చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే ఒకరి పేరు మరొకరు పచ్చబొట్టు వేసుకునేంతగా ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామని మౌనిక నాగరాజును అడగడంతో అతన నిరాకరించాడు. తన ఆరేళ్ల ప్రేమను అర్థం చేసుకోమని అతడిని బతిమలాడింది. కానీ అతను ససేమిరా అన్నాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ప్రియుడు నాగరాజు గౌడ్ ఇంటి ఎదుట ప్రియురాలు మౌనిక బైఠాయించింది. తనను పెళ్లి చేసుకునేంత వరకు ఇలాగే ఇంటి ముందు నిరసన తెలుపుతానని బీష్మించుకు కూర్చుంది. కాబోయే భార్యా భర్తలుగా సమాజంలో చెలామణి అయ్యామని.. ఇప్పుడు తన పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కంటతడిపెట్టుకుంది. బాధితురాలు చేపట్టిన న్యాయ పోరాటానికి పలువురు మద్దతు తెలిపారు.
సచిన్ టెండూల్కర్ ఇప్పటికీ నువ్వే మా హీరో
సచిన్ టెండూల్కర్.. ఆ తరం. ఈ తరం అని తేడా లేదు.. ‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా పేరుపొందిన టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. రెండున్నర దశాబ్దాల తన సుదీర్ఘ కెరియర్ లో సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. పదేళ్లు గడిచినా వాటిలో ఇప్పటికీ కొన్ని చెక్కుచెదరకుండానే ఉన్నాయి. కొన్ని రికార్డులకు కొందరు చేరువైనా.. సచిన్ ను దాటలేకపోయారు. ఇప్పటి జనరేషన్ లో విరాట్ కోహ్లీ మాత్రమే కొన్ని రికార్డులపై కన్నేశాడు. 100 టెస్టులు ఆడటమే గొప్ప అనుకుంటే.. సచిన్ ఏకంగా 200 టెస్టులు ఆడాడు. ఈ విషయంలో ఎవ్వరూ దరిదాపుల్లో లేరు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రమే 168 టెస్టు మ్యాచ్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ అనేది పేరు కాదు.. ఒక ఎమోషన్..! సచిన్ సెంచరీకోసమే ఆడతాడు. సెంచరీ చేసిన మ్యాచ్ లు ఓడిపోతాం. సచిన్ పర్సనల్ కెరియర్ కోసమే ఆడేవాడు. స్వార్ధపరుడు.. అంటూ ఇలా కామెంట్స్ చేసే పిచ్చి పుల్కా గాళ్లకి అసలు క్రికెట్ చూడటం వచ్చా అనే సందేహం వస్తుంది. అత్యధిక సెంచరీల రికార్డు. వన్డేలు (49), టెస్టులు (51) కలిపి 100 సెంచరీలను సచిన్ సాధించాడు. ఈ విషయంలో ఎవ్వరూ సచిన్ దరిదాపుల్లో లేరు. టెస్టుల్లో జాకస్ కలిస్ (45), వన్డేల్లో విరాట్ కోహ్లీ (46) రెండో స్థానంలో ఉన్నారు.అత్యధిక పరుగుల రికార్డు. 463 వన్డేల్లో 18,426 పరుగులు, 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. రెండు ఫార్మాట్లలోనే సచినే తొలి స్థానంలో ఉన్నాడు. మొత్తంగా 34,357 రన్స్ చేశాడు. రెండో స్థానంలో ఉన్న శ్రీలంక ప్లేయర్ సంగక్కర 28,016 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ 25,322 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు.అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ ఏకంగా 264 సార్లు 50, అంతకన్నా ఎక్కువ పరుగులు చేశాడు. ఇందులో వన్డేల్లోనే 145 సార్లు చేశాడు. ఈ జాబితాలోనూ రికీ పాంటింగ్ రెండోస్థానంలో ఉన్నాడు. పాంటింగ్ ఓవరాల్ గా 217 సార్లు 50 స్కోర్లు చేశాడు.