Story Board: 2024 ఎన్నికలకు ప్రధాని మోడీ సమర శంఖం పూరించారు. గత పదేళ్లలో చేసిన పనులు.. రాబోయే రోజుల్లో పెట్టుకున్న లక్ష్యాలను గుర్తుచేస్తూ.. బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని పార్లమెంట్ లో ఆవిష్కరించారు. కేవలం హ్యాట్రిక్ గెలుపు మాత్రమే కాదు.. కచ్చితంగా ఇన్ని సీట్లు రావాల్సిందేనంటూ మోడీ చేసిన ప్రకటన.. బీజేపీ శ్రేణుల్లో జోష్ తెచ్చింది. మోడీ పార్లమెంట్ లో ఆషామాషీగా ప్రకటన చేయలేదని.. 370 సీట్లు గెలుచుకునేలా క్షేత్రస్థాయిలో వ్యూహం అమలౌతోందని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉత్తరాదిన రామాలయం అంశంతో.. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవటం పెద్ద కష్టం కాదని బీజేపీ లెక్కలేస్తోంది. దక్షిణాదిలో కూడా కర్ణాటకలో మెజార్టీ ఎంపీ సీట్లు వస్తాయని, తెలంగాణలో మరింత బలం పెరుగుతుందని అంచనా వేస్తోంది. తమిళనాడు, కేరళలో మిత్రపక్షాల సాయంతో కొన్ని సీట్లు వస్తాయనే నమ్మకంతో కనిపిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ వేవ్ ఊహించని రాష్ట్రాల్లోనూ సీట్లు తెచ్చిపెట్టిందని, ఈసారి మోడీ బలం ఇంకా పెరిగిందనేది బీజేపీ లెక్క. ఇదేదో ఊరికే చెప్పడం లేదు.. అన్ని సర్వేలు, విశ్లేషణలు, క్యాడర్ నుంచి అభిప్రాయ సేకరణ తర్వాతే చెబుతున్నామని కాషాయ పార్టీ అంటోంది.
పదేళ్ల పాలన తర్వాత మోడీ చెప్పారంటే.. చేస్తారంతే అనే నమ్మకం జనానికి కలిగించామని బీజేపీ చెబుతోంది. అందుకే ప్రభుత్వ హామీలను కూడా మోడీ గ్యారంటీలుగా ప్రచారం చేసుకోగలుగుతున్నామని గుర్తుచేస్తోంది. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ ఊపు తగ్గిందన్న ప్రచారాన్ని.. ఉత్తరాదిన 3 రాష్ట్రాల ఫలితాలు పటాపంచలు చేశాయని కాషాయ శిబిరంలో చర్చ జరుగుతోంది. ఇక అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మోడీ ఇమేజ్ ఎంత పెరిగిందో ఊహించటం కూడా ప్రతిపక్షాలకు కష్టంగా ఉందని బీజేపీ విశ్లేషిస్తోంది. ఇండియా కూటమి పేరుతో హడావుడి చేసిన విపక్షాలు.. సరిగ్గా ఎన్నికల సమయానికి కాకవికలం కావడం కూడా తమకు కలిసొస్తుందని బీజేపీ లెక్కలేస్తోంది. అసలు బీజేపీకి సీట్లు పెరగవు అని చెప్పటానికి విపక్షాలకు ఒక్క పాయింట్ అయినా ఉందా అని ధీమాగా నిలదీస్తోంది. బెంగాల్, ఒడిషా లాంటి రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఈసారి సాధ్యమా అంటే.. మా వ్యూహాలు మాకున్నాయంటూ కొట్టిపారేస్తోంది బీజేపీ.
లోక్ సభ ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా వ్యూహరచనకు పదును పెట్టింది కమలం పార్టీ. ఇందుకోసం కేంద్రమంత్రులు, సీనియర్ నేతలు రంగంలోకి కసరత్తు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో నేరుగా గెలిచే సీట్లు, మిత్రపక్షాల సహకారంతో గెలిచే సీట్లు.. పార్టీ బలహీనంగా ఉన్నా.. బలమైన మిత్రులు ఉన్న రాష్ట్రాలు, అసలు పార్టీకి ఉనికి లేని రాష్ట్రాలు.. ఇలా విడగొట్టి వ్యహాలు రచిస్తున్నారు బీజేపీ నేతలు. అవకాశం ఉన్న ప్రతిచోటా సీట్లు పెంచుకోవడం మాత్రమే కాదు.. అవకాశం లేనిచోట కూడా అవకాశాన్ని సృష్టించుకోవడం కోసం వ్యూహాలు రచిస్తున్నామని బీజేపీ చెబుతోంది. దేశవ్యాప్తంగా మోడీకి ప్రజాదరణ ఉందని, లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు అసలు పోటీనే కాదని, కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉందని బీజేపీ అభిప్రాయపడుతోంది.
పదేళ్లలో దేశం ఎంత ముందుకెళ్లిందో కళ్ల ముందే ఉందనేది బీజేపీ మాట. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే కాదు.. అంతర్జాతీయ సంస్థల గణాంకాలు కూడా భారత్ విజయగాథ చెబుతున్నామని ఆ పార్టీ గుర్తుచేస్తోంది. మౌలిక వసతుల కల్పనలో తమ సర్కారుతో ఎవరికీ పోటీ లేదనేది బీజేపీ వాదన. ప్రపంచ దేశాల్లో సంక్షోభాలున్నా.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడకుండా ప్రధాని మోడీ కాచుకుంటున్నారని బీజేపీ చెబుతోంది. పెట్రోల్, గ్యాస్ ధరల విషయంలో విపక్షాలది పిడివాదమని, అసలు విషయాన్ని జనం అర్థం చేసుకున్నారని కాషాయ పార్టీ నమ్ముతోంది. విపక్షాలకు వేలెత్తి చూపే అవకాశం లేకుండా మోడీ పాలన ఉందని బీజేపీ బల్లగుద్ది మరీ చెబుతోంది. దీనికితోడు దేశవ్యాప్తంగా జరుగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రలకు జనం నుంచి మంచి స్పందన ఉందని గుర్తుచేస్తోంది. ఈ సంకల్ప యాత్రల్నే కౌంటర్ చేయలేకపోతున్న విపక్షాలు.. ఇక ఎన్నికల ప్రచారంలో బీజేపీ ధాటిని ఎలా తట్టుకుంటాయని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది.
అధికారంలోకి వస్తామనే అతి విశ్వాసంతో తప్పులు చేయొద్దని బీజేపీ ఎంపీలకు ఎప్పటికప్పుడు మోడీ హితవు చెబుతున్నారు. గెలుపు ఖాయమనే ఉద్దేశంతో..జనంలో తిరగడం మానొద్దని హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్షాల ప్రచారం మొదలయ్యేలోపే ఓ విడత ప్రచారం పూర్తిచేసేలా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఎంపీల పనితీరుపై సర్వేలు చేయిస్తున్న మోడీ.. తేడా వస్తే.. క్లాసులు పీకడానికి సందేహించడం లేదు. కేంద్ర మంత్రులకూ ఇదే సూత్రం వర్తిస్తోంది. స్వయంగా స్వీయ మదింపు కూడా చేసుకుంటున్నట్టు మోడీ చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రతి ఒక్కరూ టార్గెట్ పెట్టుకుని.. లక్ష్యం సాధించేలా పనిచేయాల్సిందేనని, పార్టీలో ఎవరికీ మినహాయింపుల్లేవని ప్రధాని స్పష్టంగా చెబుతున్నారు. అందరికంటే ఎక్కువగా మోడీనే ఎక్కువగా జనంలో తిరుగుతున్నారు. దీంతో ఎంపీలు కూడా జనం బాట పట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
వికసిత భారత్ సంకల్ప యాత్రల్లో కేంద్రమంత్రులందరూ పాల్గొన్నారు. దీంతో ఎంపీలందరూ కదలక తప్పలేదు. కేవలం ప్రోగ్రామ్ ఇవ్వడమే కాదు.. స్వయంగా ఆచరించి చూపే వైఖరితో మోడీ అనుకున్న ఫలితాలు సాధిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేవలం మోడీ ఇమేజ్ ను నమ్ముకుని బీజేపీ ఎన్నికలకు వెళ్తోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నా.. అదే తమ బలమని బీజేపీ కౌంటరిస్తోంది. బలమైన నేత ఇమేజ్ ను వాడుకుంటే తప్పేముందని ఎదురుప్రశ్నిస్తోంది. నాయకత్వ లేమితో బాధపడుతున్న విపక్షాల మాటలు పట్టించుకోబోమని చెబుతోంది. మోడీకి దీటుగా ఎవరున్నారో ప్రతిపక్షాలు చెప్పాలని సవాల్ విసురుతోంది.
2019 కంటే 2024లో కచ్చితంగా బీజేపీ సీట్లు పెరుగుతాయని మోడీ బలంగా నమ్ముతున్నారు. పరిపాలన కచ్చితంగా సంతృప్తికరంగా ఉందని, ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా లేదని అంచనాలు వేస్తున్నారు. బీజేపీకి సహజంగా ఉండే ఓటుబ్యాంకుకు తోడు.. మోడీ ఇమేజ్ తో కొంత ఓటు బ్యాంకు కలిసొస్తుందని చెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయం లాంటి నిర్ణయాలు.. భావోద్వేగ ఓటుబ్యాంకును సృష్టిస్తాయని లెక్కలేస్తున్నారు. అదనంగా సామాజిక సమీకరణాలు కూడా వర్కవుట్ అయితే.. ఇక తిరుగులేదనే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. కేవలం హిందుత్వ ఓట్లనే నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడం లేదని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. బలమైన ఓబీసీ వర్గాన్ని ఆకట్టుకోవడంతో పాటు.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమనే విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో బీజేపీ పనిచేస్తోంది. ఎలా చూసుకున్నా.. ప్రతి నియోజకవర్గంలో 50 శాతం పైగా ఓట్లు వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు కమలనాథులు. ఇంత పక్కాగా వ్యూహరచన చేశాక.. లక్ష్యాన్ని ఛేదించకపోవడమనే ప్రశ్నే ఉండదనే ధీమాతో ఉంది బీజేపీ.
కేవలం దేశంలో జరిగే పరిణామాలు చూసి మాత్రమే ఓట్లు పడవనేది బీజేపీ అంచనా. భారత్ కు అంతర్జాతీయంగా పెరిగిన పేరుప్రతిష్ఠలు కూడా ఓట్లు తెచ్చిపెడతాయని లెక్కలేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల మద్దతు కూడా తమకే ఉందని నమ్ముతోంది. ఇలా పెద్దగా బయటకు కనిపించని చాలా అంశాలు పోలింగ్ నాటికి ప్రభావం చూపిస్తాయనేది బీజేపీ చెప్పే మాట. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం కూడా లోక్ సభ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపుతుందని కాషాయ పార్టీ భావిస్తోంది. తమ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయని, పోలింగ్ నాటికి ఒకటొకటిగా బయటకు తీస్తామని చెబుతోంది. చేసిన పనులు చెప్పుకోవడం, కాంగ్రెస్ ను మరింతగా విమర్శించటం, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించటం.. ఈ త్రిముఖ వ్యూహమే హ్యాట్రిక్ విజయాన్ని తెచ్చిపెడుతుందని బీజేపీ బల్లగుద్ది మరీ చెబుతోంది. మోడీ కూడా అదే ధీమాతో ఎన్ని సీట్లు గెలుస్తామో కూడా పక్కాగా చెప్పగలుగుతున్నారనే వాదన వినిపిస్తోంది.