లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అక్టోబర్ 4కు న్యాయస్థానం వాయిదా వేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు విచారణ చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సీమాను కలుసుకునేందుకు మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ మంజూరు జారీ చేయాలని కోరుతూ మనీష్ సిసోడియా సుప్రీంకోర్టుకు వెళ్లారు. తన భార్య ఆరోగ్యం క్షీణిస్తోందని సుప్రీం ధర్మాసనానికి సిసోడియా విన్నవించుకున్నారు. మనీష్ తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సంఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. తన తరుపున వాదనలకు రెండు గంటల సమయం ఇవ్వాలని సుప్రీం బెంచ్‌ను ఆయన కోరారు. తమ క్లయింట్ అభ్యర్ధనపై తక్షణం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సిసోడియా లాయర్ కోరారు.
Read Also: IND vs BAN: టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
ఢిల్లీ ఎక్సైజ్ పోర్టు ఫోలియోను నిర్వహించే క్రమంలో మద్యం కుంభకోణం జరిగిందని సీబీఐ అధికారులు మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా పదవిని కూడా నిర్వర్తించారు. అయితే.. మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 26న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆయన్ని అరెస్టు చేసింది. అప్పటి నుంచీ కస్టడీలోనే మనీష్ సిసోడియా ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ కూడా సిసోడియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేయగా.. ఫిబ్రవరి 28న ఢిల్లీ ప్రభుత్వంలోని తన పదవులకు సిసోడియా రిజైన్ చేశాడు.