వ్యవసాయం ఆగిపోతే ప్రపంచం అంతరిస్తుందని…వ్యవసాయం బాగుండాలి… అన్నదాతను గౌరవించాలని… ప్రపంచ వ్యవసాయానికి నీటి ప్రాముఖ్యత తెలిపిన నేల ఓరుగల్లు అని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. 11 వ శతాబ్దంలోనే గొలుసుకట్టు చెరువులు, కుంటలు, ప్రముఖ ఆలయాలను కాకతీయ రాజులు నిర్మించారని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టులన్నీ నిజాంసాగర్ నిర్మించిన తర్వాతవే అని ఆయన అన్నారు. ప్రపంచంలోని ఆధునిక ప్రాజెక్టులకు భిన్నంగా పారే నీళ్లు ఎదురెక్కేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలో అతి పెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారని వెల్లడించారు. సాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చి తెలంగాణలో సాగుకు అనుకూలమైన భూమిని సేద్యంలోకి తీసుకువచ్చామని అన్నారు.
ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతుకు బీమా అందించే ఏకైక సీఎం కేసీఆరే అని.. రైతుకు రైతుబంధు ద్వారా ఎదురుపెట్టుబడి ఇస్తున్నది కేసీఆర్ అని నిరంజర్ రెడ్డి అన్నారు. ఏది పండించాలి ? ఏది పండించకూడదు ? అని తెలుసుకుని సాగు చేస్తే అది లాభసాటి వ్యవసాయం అవుతుందని… 5 శాతం మాత్రమే జీవరాశి జీవించగలిగే ఈజిప్ట్ లో కోటి ఎకరాలలో భూమి మాత్రమే సాగవుతుందని.. అక్కడి ప్రభుత్వం ఏ పంటలు పండించాలో రైతులకు నిర్ధేశిస్తుందని.. రైతులు కూడా ప్రభుత్వం చెప్పిన పంటలనే సాగు చేస్తారని వెల్లడించారు. మొన్నటి వరకు ఇతర దేశాలపై ఆధారపడిన ఈజిప్టు ఇప్పుడు యూరప్ దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందని చెప్పుకొచ్చారు. చిన్న, చిన్న దేశాలు ఇతర దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేస్తుంటే .. దాదాపు 40 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్న మన దేశం గోధుమ ఎగుమతులను నిషేధించడం గమనార్హం అని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపాన్ని సంపూర్ణంగా మారిస్తే .. తెలంగాణ నుండి వస్తున్న వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం ప్రకటించడాన్ని రైతులు గమనించాలని ఆయన కోరాడు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని 2008 నుండి కొట్లాడుతున్నాం .. దీనిపై మాట్లాడిన తొలి ఎంపీ వినోద్ కుమార్ అని గుర్తు చేశారు. దీనిపై మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 2014 బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి మాటతప్పారని విమర్శించారు. తమ పాలిత రాష్ట్రాల్లో చేయ చేతగాని కాంగ్రెస్ తెలంగాణలో డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతులు అమాయకులని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయని.. చాంధసవాద దేశాలు అనుకున్న ప్రాంతాలు మహిళల భాగస్వామ్యంతో పురోగమిస్తున్నాయని, మన దేశాన్ని మాత్రం తిరోగమనం వైపు నడిపిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.