టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ ముగిసింది. సుమారు రెండు గంటల సేపు సాగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశం.. ఎన్నికల కోడ్ వచ్చినా మారని కొందరి అధికారుల పని తీరు మీదే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికీ కొందరు ఐఏఎస్, ఐపీఎస్సులు అధికార పార్టీకి అండగా ఉన్నారనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. పెన్షన్ల పంపిణీ విషయంలో కొందరి అధికారుల తీరును కూటమి నేతల సమావేశంలో ప్రస్తావనకు తీసుకొచ్చారు. వైసీపీ చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఉమ్మడిగా ఫిర్యాదులు చేయాలని ఎన్డీఏ కూటమి నేతలు ఓ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఫిర్యాదులు చేయడమే కాకుండా చర్యలు తీసుకునే వరకు పోరాడాలని అభిప్రాయపడ్డారు. ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేసేలా.. ఎన్నికల సంఘంతో నిరంతరం మాట్లాడుతుండాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూటమి నేతలకు చెప్పుకొచ్చారు.
Read Also: PM Modi: అతి త్వరలో జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. ప్రధాని మోడీ..!
రియల్ టైంలో సమస్యలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం బూత్ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయానికి ఎన్డీఏ నేతలు వచ్చారు. ప్రచారం, ఎన్నికల నిర్వహణ, వ్యూహాలపై రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల బదిలీపై క్షేత్ర స్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగినట్లు సమాచారం. చాలా ప్రాంతాల్లో నేతలు మంచి సమన్వయంతో వెళుతున్నారని.. ఇది మంచి పరిణామం అని నేతలు అభిప్రాయ పడ్డారు. గోదావరి జిల్లాల్లో జరిగిన కూటమి సభల సూపర్ సక్సెస్ పై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఇదే తరహా ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించాలని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూటమి తరుపున ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీతో సహా అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ లాంటి అగ్రనేతలు పాల్గొనేలా ఎన్డీయే కూటమిలోని పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
Read Also: Jasprit Bumrah: ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా విజయ రహస్యమేంటంటే..?
దీంతో పాటు ఎన్డీఏ కూటమి నేతల భేటీలో ఒకట్రొండు స్థానాల్లో మార్పు చేర్పులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అనపర్తి, ఉండి, తంబళ్లపల్లె, లాంటి స్థానాల్లో మార్పు చేర్పులపై ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది. సీటు కొల్పోకుండా.. ఓటు చీలకుండా సీట్ల సర్దుబాట్లు ఉండాలని కూటమి నేతలు అభిప్రాయపడ్డారు. సీట్ల సర్దుబాటుపై ఢిల్లీ నేతలతో కూడా సంప్రదింపులు జరిపి ఓ నిర్ణయం తీసుకోవాలని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపిన తర్వాత పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో ఓ అభిప్రాయానికి రావాలని కూటమి నేతలు తెలిపారు.