ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల పోరుకు సిద్ధం అవుతున్నాయి. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన మధ్య తీవ్రంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల జనసేన ఇన్ ఛార్జ్ లతో రాజమండ్రిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. టీడీపీ- జనసేన పార్టీల మధ్య పొత్తులో సీట్ల సర్దుబాటు విషయమై ఇన్చార్జీలతో భేటీలో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. టికెట్ రాలేదని ఎవరు నిరుత్సాహ పడవద్దని ఇన్చార్జీలకు నాదెండ్ల సూచించారు. అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పారు. టీడీపీ- జనసేన పొత్తులో టిక్కెట్ ఎవరికి వచ్చిన గెలుపు కోసం కృషి చేయాలని మనోహర్ విజ్ఞప్తి చేశారు.
Read Also: RJ Balaji: థియేటర్లలో బంధించి చూపిస్తున్నారు… ‘యానిమల్’పై తమిళ హీరో స్ట్రాంగ్ కామెంట్స్
అయితే, మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు 3 ఎమ్మెల్యే నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. నర్సాపూరం, గాజువాక, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీరితో పాటు 50 నియోజకవర్గాలలో ఎవరికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలో అనే విషయంపై జనసేన పార్టీకి చెందిన నేతలతో నాదేండ్ల మనోహర్ ప్రధానంగా చర్చించారు.