Women Hides Huge Gold In Sanitary Pads in Mumbai: కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిఘా పెంచినా.. విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ ఏమాత్రం ఆగడం లేదు. బంగారంను అక్రమంగా తరలించేందుకు కొత్తకొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ భలే తెలివిగా గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. ఏకంగా శానిటరీ ప్యాడ్స్‌లో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు ప్రయత్నించి.. కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కింది. ఈ ఘటన ముంబైలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 52 ఏళ్ల జయేష్ సోనీ అనే నగల వ్యాపారికి స్మగ్లర్ జిగ్నేష్ రాథోడ్, అతడి భార్య షీలా బంగారం అక్రమంగా తరలించేందుకు సహాయం చేశారు. జయేష్ సోనీ నాలుగు రోజుల పర్యటన కోసం (స్పాన్సర్డ్ ట్రిప్‌కు) రాథోడ్, షీలాలను దుబాయ్‌కు పంపాడు. అక్కడ నైల్ హోటల్లో బస చేసిన వారికి చేతన్ చౌదరి అనే వ్యక్తి ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన భారీ చొక్కా, లోదుస్తులు మరియు శానిటరీ ప్యాడ్‌ను అందించాడు. జూన్ 19న ముంబైకి వచ్చిన ఈ జంట విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ తనిఖీల నుంచి తప్పించుకున్నారు.
ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ కళ్లుగప్పిన స్మగ్లర్ జిగ్నేష్ రాథోడ్, అతడి భార్య షీలా.. రైలు, బస్సుల ద్వారా అహ్మదాబాద్‌కు వెళ్లారు. చొక్కా, లోదుస్తులు మరియు శానిటరీ ప్యాడ్ దొంగిలించబడినట్లు జయేష్ సోనీకి రాథోడ్ చెప్పాడు. దాంతో తన స్నేహితుడు, బంగారం వ్యాపారి కేతన్ సోనీని జయేష్ కలిశాడు. వారు సేకరించిన బంగారాన్ని రూ. 45 లక్షలకు విక్రయించి.. మిగిలిన 546 గ్రాముల బంగారాన్ని (32.77 లక్షలు) తన వద్ద ఉంచారు.
బంగారం స్మగ్లింగ్‌పై కస్టమ్స్ విభాగానికి సమాచారం అందించినట్లు క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. బంగారం కొనుగోలుదారులు కేతన్ సోనీ మరియు జయేష్ సోనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేతన్ సోనీ, జయేష్ సోనీని అరెస్ట్ చేసి బంగారం, నగదు స్వాదీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు ఇంతకుముందు కూడా బంగారం స్మగ్లింగ్ చేశారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. స్మగ్లర్ జిగ్నేష్ రాథోడ్ ను సైతం అరెస్ట్ చేసారు.
Also Read: Wimbledon Final 2023: వింబుల్డన్ ఫైనల్లో ఓడిన జొకోవిచ్.. ఛాంపియన్‌గా యువ సంచలనం అల్కరాస్!