Jagruthi Foundation Day 2025: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. నిజమైన దీక్షలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్లి ఉట్టి ఉట్టి దర్నాలు చేయడం కాదని ఎద్దేవా చేశారు. బీసీల కోసం తాము 72 గంటల పాటు దీక్షకు పూనుకున్నాం అని, కోర్టు నుంచి పర్మిషన్ రాలేదన్నారు. బీసీల కోసం జాగృతి కార్యచరణ సిద్ధం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నేడు తెలంగాణ జాగృతి వ్యవస్థాపన దినోత్సవం. ఈ సందర్భంగా జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు జెండాను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయ శంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు.
‘తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ చెప్పినట్లుగా, వారి బాటలో తెలంగాణ జాగృతి ముందుకు వెళ్లింది. జయ శంకర్ సార్ ఆలోచనలను తూచా తప్పకుండా పాటించాము. తెలంగాణ చూడకుండానే జయ శంకర్ సార్ దూరం అయ్యారు. జయ శంకర్ సార్ జయంతి సందర్భంగా జాగృతి ఫౌండేషన్ డే జరుపుకుంటున్నాం. సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలని జయశంకర్ సార్ అనేక సార్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని వర్గాలు వారికి సమన్యాయం జరగాలని చెప్పేవారు. జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్లి ఉట్టిఉట్టి దర్నాలు చేయడం కాదు. బీసీల కోసం మేము 72 గంటల పాటు దీక్షకు పూనుకున్నాం. కోర్టు నుంచి మాకు పర్మిషన్ రాలేదు’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు.
Also Read: Gold Rate Today: ఆగని పసిడి పరుగు.. కొనాలంటే కష్టమే! నేటి గోల్డ్ రేట్స్ ఇలా
‘కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. నిజమైన దీక్షలు చేయాలి. జాగృతిలోకి వచ్చేందుకు చాల మంది రెడీగా ఉన్నారు, మాకు అన్ని వర్గాల సపోర్ట్ వస్తుంది. బీసీల కోసం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు చిత్తశుద్ధితో పని చేయటం లేదు. బీసీల కోసం జాగృతి కార్యచరణ సిద్ధం చేస్తుంది. ముస్లిం రిజర్వేషన్లపై బండి సంజయ్ మాట్లాడకపోతే విచిత్రం. బీసీలకు ఇచ్చే 42 శాతం రిజర్వేషన్లో ముస్లింలు ఉండొద్దని ముందు నుంచి బండి సంజయ్ మాట్లాడుతునే ఉన్నాడు. బీజేపీ బీసీలను మోసం చేస్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతి ఒక్క పార్టీతో జై తెలంగాణ అనిపించాము. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళాలి, అన్ని పార్టీల నాయకులకు లేఖలు రాయాలి. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకొని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం’ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.