Botsa Satyanarayana: గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన అంశంపై క్లారిటీ ఇవ్వడానికి ఎన్ని రోజులు కావాలని అడిగారు. సీరియస్‌గా తీసుకోకపోతే ఇదో అలవాటుగా మారిపోతుందన్నారు. మిడ్ డే మీల్స్ లోపాలపై ఒక్క సమీక్ష అయిన జరిగిందా అని ఆయన ప్రశ్నలు గుప్పించారు. జూన్ 12న ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు 9 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయని తెలిపారు. విద్యార్థులు, వాళ్లకు పంపిణీ చేసే ఆహారం పట్ల నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని.. దీనికి గత ప్రభుత్వానిదే బాధ్యత అని తప్పించుకుంటారా అంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Tragedy: మరో తీవ్ర విషాదం.. వాగులో కొట్టుకుపోయి ముగ్గురు దుర్మరణం
ఒక్క ఘటనలో కఠినమైన చర్యలు తీసుకుని వుంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు.ఇన్ని జరుగుతుంటే విద్యాశాఖ, జిల్లా యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పిల్లల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎసెన్షియా ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన కుటుంబాలకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేస్తున్నామని ఆయన తెలిపారు. రేపటీలోగా పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఎఫెక్ట్ అయినజిల్లాల్లో వైసీపీ శ్రేణులు సహాయచర్యలలో పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో వాస్తవాలను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా చర్యలు ఉండాలని కోరారు. మిడ్ డే మీల్స్ ధరలు పెరిగితే సమీక్షించుకుని సవరించుకోవడం ప్రభుత్వం బాధ్యత అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు, నాయకుల చర్యల వల్ల పార్టీకి నష్టం జరిగితే.. పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు.