కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. లెజెండ్ సినిమా 400 రోజులు ప్రదర్శించి దేశ చరిత్రలో ఎమ్మిగనూరు నిలిచిపోయిందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా మనమేనని అన్నారు. ఎన్టీఆర్ నటనకు విశ్వరూపం అని చెప్పారు. మరోవైపు.. మహిళల్లో చంద్రబాబు ఆర్థిక విప్లవాన్ని తెచ్చారని పేర్కొన్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు ఇచ్చిన అభినవ భగీరథుడు అని కొనియాడారు.
రాష్ట్రంలో సుపరిపాలన కావాలా, విధ్వంసం కావాలా బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.. మధ్య నిషేధం అని ప్రజలను జగనన్న జలగలా పీడిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు.. సిద్ధం సభల కోసం రూ.1600 కోట్లు ఖర్చుపెట్టారని పేర్కొన్నారు. అక్రమంగా దోచుకోవడానికి సిద్ధమా.. జె బ్రాండ్ మద్యంతో లక్షల కోట్లు దోచుకోవడానికి సిద్ధమా అని విమర్శించారు. ఇక ఇవన్నీ సాగవని రేపటి ఎన్నికల్లో చెప్పాలని కోరారు. ప్రజలు తమ ఉనికిని కాపాడుకోవడానికి సమయం ఆసన్నమైంది.. ఓటుతో పొడిచి అపజయం రుచి చూపించండని వ్యాఖ్యానించారు.
CM YS Jagan: చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపే..
దళితుణ్ణి చంపేసి డోర్ డెలివరీ చేశారు.. ఎమ్మిగనూరులో చేనేత కార్మికుడు 2 సెంట్ల భూమి కోసం ఆత్మహత్య చేసుకున్నారు.. మైనార్టీ బాలిక హజీరాను అత్యాచారం చేసి చంపేశారని బాలకృష్ణ దుయ్యబట్టారు. ఓటు ఆయుధం.. ప్రజాస్వామ్య పరిరక్షణకు వినియోగించండి.. ప్రలోభాలకు లొంగకుండా జవాబుదారీ ప్రభుత్వాన్ని ఎన్నుకోండని తెలిపారు. ఎమ్మిగనూరులో టీడీపీ హయాంలో టెక్స్ టైల్ పార్క్ కి 100 ఎకరాలు కేటాయిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని విమర్శించారు. రోడ్డులో ఒక్క గొయ్యి పూడ్చారా అని ప్రశ్నించారు. పసుపు జెండా కదిలితే తాడేపల్లిలో జగన్ గుండెల్లో అదురుతోంది అని తెలిపారు.
జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూమి పట్టాలపై ఫోటో వేసుకొని తాకట్టు పెట్టి అప్పులు చేస్తాడని బాలకృష్ణ ఆరోపించారు. జగన్ మళ్లీ వస్తే ఆస్తులు వదిలేసి రాష్ట్రాన్ని వదిలి వెళ్ళాల్సివస్తుందని అన్నారు. సీపీఎస్ వారంలో రద్దు చేస్తానన్న జగన్ మాట ఏమైంది.. జగన్ కు ఓటు వేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టేనని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని దుష్ప్రచారం చేస్తున్నారు.. జగన్ మొహం చూస్తే ముచ్చుమూతి ముదరష్టంలా ఉంటుందని దుయ్యబట్టారు. జగన్ రాష్ట్రాన్ని 15, 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారని బాలకృష్ణ ఆరోపించారు.