మధ్యప్రదేశ్‌లోని గుణ రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే పట్టాలపై వచ్చి పడుకున్నాడు కానీ.. అదృష్టవశాత్తూ రైలు అతనిపై నుండి వెళ్ళిన బతికి బట్ట కట్టాడు. ఆ వృద్ధుడికి ఒక్క చిన్న గాయం కూడా రాలేదు. ఈ ఘటన గురువారం గుణ రైల్వే స్టేషన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 70 ఏళ్ల వృద్ధుడు రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. ఇంతలో గూడ్స్ రైలు ఆ పట్టాల మీద నుండి వెళ్లిపోయింది. అయితే అక్కడున్న వారు ఈ ఘటన చూసి చాలా భయభ్రాంతులకు గురయ్యారు.
గుణ స్టేషన్ సమీపంలో ఆ వృద్ధుడు నివసిస్తున్నాడు. అయితే అతనికి ఎవరు లేరు. బహుశా ఒంటరితనం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అక్కడి స్థానికులు చెబుతున్నారు. మరోవైపు వృద్ధుడి తలను ఒక కోణంలో ఉంచడంతో వృద్ధుడిపై రైలు వెళ్లలేదు. ఈ క్రమంలో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అనంతరం రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని.. వృద్ధుడితో మాట్లాడి అక్కడి నుంచి పంపించారు. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఈ ఘటనపై రైల్వే అధికారి మాట్లాడుతూ.. గత గంటగా తాను రైల్వే స్టేషన్‌లో కూర్చున్నానని, అయితే అకస్మాత్తుగా గూడ్స్ రైలు రావడంతో వృద్ధుడు ట్రాక్‌పైకి దూకినట్లు తెలిపారు. ఆ తర్వాత అతను ట్రాక్ మధ్యలో పడుకున్నాడని చెప్పారు. ట్రాక్‌పై పడి ఉన్న అతడిని కాపాడేందుకు పరిగెత్తే సమయానికి రైలు అతడిపై నుంచి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆ వృద్ధుడికి గాయాలు కాలేదని చెప్పారు. అనంతరం వృద్ధుడిని వృద్ధాశ్రమానికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.