Minister Peddireddy: చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, దాడులు, ప్రతిదాడులు, రాళ్ల విసురుకోవడం, విధ్వంసం సృష్టించడం అన్నీ జరిగిపోయాయి.. అయితే, ఈ ఘటనలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు.. నిన్న చంద్రబాబు నాయుడు ర్యాలీలో గాయపడి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిన ఈ రోజు పరామర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మేల్యేలు.. నిన్నటి ఘటన అనంతరం బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో చిత్తూరులో మంత్రికి భారీగా స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు.. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు..
ఇక, ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయంగా దివాలా తీశారు.. అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధ పడుతున్నారు. పుంగనూరు బైపాస్ నుండి వెళ్తాం అని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చారు.. ఆ తర్వత కావాలనే పుంగనూరులోకి వెళ్లాలని ప్రయత్నించారని మండిపడ్డారు. ఆ తర్వత వారు పోలీసులపై విచక్షణంగా దాడి చేశారు.. చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను పోలీసులపై దాడికి పాల్పడేలా చేశారని ఆరోపించారు. అనరాని మాటలు తిడుతూ ప్రజలను రెచ్చగొట్టారు.. పోలీసులపై ఈ స్థాయిలో దాడి జరిగిన ఘటనలు ఇటీవల కాలంలో లేవన్నారు. కుప్పంలో ఓడిపోతాను అన్న భయంతో చంద్రబాబు ఈ నీచానికి దిగారు ఫైర్ అయ్యారు. కచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. పోలీసులకు, ప్రభుత్వానికి ఇది ప్రతిష్టాత్మకం అన్నారు.
షార్ట్ గన్స్ కు లైసెన్స్ ఉండదు.. కానీ, వారు ఆయుధాలు తెచ్చుకున్నారని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి.. కుప్పం అనగానే చంద్రబాబు కు ఓటమి, పెద్దిరెడ్డి గుర్తొస్తారన్న ఆయన.. అందుకే ఈ దాడులకు పాల్పడ్డారు.. 200 వాహనాల్లో రౌడీలను తెచ్చుకున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. కాగా, పుంగనూరు ఘటనను నిరసిస్తూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.. పలు చోట్ల వైసీపీ శ్రేణులు ధర్నాలు, నిరసన ర్యాలీలు చేపట్టాయి. చిత్తూరు ప్రభుత్వాసుపత్రి ఎదుట చంద్రబాబు దిష్టి బొమ్మను దద్ధం చేశాయి వైసీపీ శ్రేణులు.. కుప్పం, పలమనేరు, పుంగనూరులో చంద్రబాబు దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అయితే, నిన్నటి ఘటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా బంద్ చేపట్టాలని చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చిన విషయం విదితమే.