KTR: రాష్ట్రానికి మోడీ చేసిన మోసాలు, బీజేపీ చేసిన అన్యాయాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని మంత్రి కేటీఆర్ నేతలకు సూచించారు. బీఅర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో కేటీఆర్ ఆదివారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ నెల 25న జరగబోయే ప్రతినిధుల సభలు.. వచ్చే ఎన్నికలకు బలమైన పునాదిరాళ్లు అంటూ నేతలకు సూచనలు చేశారు. తొమ్మిదేళ్లలో మారిన తెలంగాణ ముఖచిత్రంపై సభల్లో తీర్మానాలు చేయాలని నిర్ధేశించారు. దేశంలో కేసీఆర్ అంటే సంక్షేమమని, మోడీ అంటే సంక్షోభమని.. ముఖ్యమంత్రికి, ప్రధాన మంత్రికి మధ్య వ్యత్యాసాన్ని వివరించాలన్నారు. మోడీ అంటేనే మొండిచెయ్యి అనే విషయం, ప్రతి గడపకు చేరాలని, ప్రతిగుండెను తట్టాలన్నారు. నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సభలో కనీసం 6 తీర్మానాలు చేయాలని చెప్పారు. వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి- పట్టణ ప్రగతి, విద్య- ఉపాధి, బీజేపీ వైఫల్యాలు, స్థానిక అంశాలపై తీర్మానాలు చేయాలని కేటీఆర్ సూచించారు. ప్రతినిధుల సభలో చేసే తీర్మానాలు ప్రజలను ఆలోచింపజేసేలా ఉండాలన్నారు. నియోజకవర్గ ప్రతినిధుల సభల ద్వారా సుమారు నాలుగు లక్షల మంది పార్టీ శ్రేణులకు అన్ని కీలక అంశాలపైన రాజకీయంగా దిశానిర్దేశం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కేటీఆర్ తెలిపారు.
అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడిన కేటీఆర్
ఇదిలా ఉండగా.. కేంద్ర మంత్రి అమిత్ షా చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. ఎంఐఎం భుజంపై తుప్పుపట్టిన బీజేపీ తుపాకీపెట్టి ఎంతకాలం కాలుస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ అంటూ విమర్శించారు. పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అంటూ కేటీఆర్ తెలిపారు. కేంద్ర నిధులు దుర్వినియోగమా? అంటూ ప్రశ్నించిన కేటీఆర్.. బారాణా తీసుకుని చారాణా కూడా ఇవ్వని బీజేపికి మిగిలేది బూడిదే అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అదానీ విషయంలో జేపీసీ కాదు కదా కనీసం సిట్ కూడా వేయని వారు అవినీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లో మోడీ హయాంలో మీరు హోం మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకులలో గుజరాత్ నెంబర్‌వన్‌గా ఉన్నమాట నిజం కాదా? అని ప్రశ్నించారు. గత ఎనిమిది ఏళ్లలో గుజరాత్ లో 13 సార్లు పేపర్ లీక్స్ కాలేదా ? అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఈ దేశంలో వ్యాపం లాంటి స్కాం చేసింది బీజేపీ పార్టీ ప్రభుత్వం కాదా? అంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Dharmapuri Issue: తెరుచుకున్న స్ట్రాంగ్‌రూమ్.. 26న హైకోర్టుకు నివేదిక
త్వరలో అధికారంలోకి కాదు.. బీజేపీ అంధకారంలోకి వెళ్తుందన్నారు. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ అవుతుందని.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ కూడా ఖాళీ అవుతుందన్నారు. 2024లో వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదని కేటీఆర్ అన్నారు. మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే..దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టే అనే బలమైన భావనలో ప్రజలు ఉన్నారని కేటీఆర్ చెప్పారు. బీజేపీ స్టీరింగే అదానీ చేతికి చిక్కిందని.. కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం విలవిలలాడుతోందని విమర్శలు గుప్పించారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్‌తో బీజేపీ ఫుల్ పిక్చర్‌ను దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారని.. ఇంకా ఏ ట్రయిలర్ అవసరం లేదన్నారు. తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు నడవవని.. ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవన్నారు. అదానీపై జేపీసీ వేయని బీజేపీకి సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కు ఉందా అంటూ ప్రశ్నించారు. పీఎం కేర్స్‌లో ఎంత జమైంది.. ఏ విధంగా ఖర్చయిందో చెప్పని వారు.. కాగ్ మాత్రమే కాక అన్ని రకాల బ్యాంక్స్ ఆడిట్‌లతో కట్టిన ప్రాజెక్టులపై మాట్లాడడం.. అవివేకం కాక మరి ఏమిటని ప్రశ్నించారు. ఎనిమిది ఏళ్లుగా కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా ఇక్కడికి వచ్చి ఎవరో మీ గులాములు రాసిచ్చిన స్క్రిప్టును వల్లెవేస్తె నమ్మేదెవరంటూ కేటీఆర్ మండిపడ్డారు.