తెలంగాణలో బీజేపీ నేతలకు టీఆర్‌ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేప అధిష్టానం తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేసేందుకు లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ నేతలు తెలంగాణలో మునపటి కంటే ఎక్కువగా పర్యటిస్తుండటం దానికి నిదర్శనం. అయితే.. తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే టీఆర్‌ఎస్ నేతలు సైతం కౌంటర్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపోళ్లు ఉన్న పథకాలు బంద్ పెట్టారంటూ ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. బీజేపీవి అన్ని రద్దులే తప్ప…ఏమైనా పద్దులు ఇచ్చిండ్రా అని ఆయన ప్రశ్నించారు. మన దేశంలో ఎగరేసిన జాతీయ జెండాలు చైనా నుంచి తెప్పించారంటూ ఆయన ఆరోపించారు.
పవర్‌లూమ్స్ బోర్డును కూడా రద్దు చేసింది బీజేపీ అని, మనం మాత్రం మన చేనేత కార్మికులతో జెండాలు చేయించామన్నారు మంత్రి హరీష్ రావు. 5 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచారని, చేనేత వస్త్రాల మీద జీఎస్టీ పెంచడంతో చేనేత రంగం నష్టపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలు తయారుచేయడానికి చేనేతలకు ఆర్డర్ ఇచ్చినమని ఆయన వెల్లడించారు. బీజేపీ పేదలకు చేసిందేమీ లేదని, అంతా కార్పొరేట్ కంపెనీలకే బీజేపీ పనిచేస్తోందన్నారు.