Ambati Rambabu: మిచౌంగ్ తుఫాన్ ఏపీలో విధ్వంసం సృష్టించింది.. అయితే, రైతులు ధైర్యంగా ఉండండి.. నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తాం అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు. అత్యధికంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వర్షపాతం నమోదైంది.. ఈ తుఫాన్ తో రైతాంగం పంటలు కోల్పోయారు.. మిర్చి, అరటి, పత్తి , బెంగాల్ గ్రామ్ పంటలు పూర్తిగా పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటుంది.. గతంలో హెక్టార్‌కు 15 వేల సబ్సిడీ ఉంటే జీవో నెంబర్ 5 ద్వారా ఆ మొత్తాన్ని రూ.17 వేలకు పెంచామని వెల్లడించారు.
Read Also: IB ACIO 2023: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 పోస్టులు.. పూర్తి వివరాలివే..
9వ తేదీ నుండి నష్టపరిహారం అంచనా వేయటానికి బృందాలు పర్యటిస్తాయి అని తెలిపారు మంత్రి అంబటి.. రైతాంగం వేసిన పంటల్లో 33 శాతం పంటలు నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా ఉందన్న ఆయన.. రైతులు ధైర్యం గా ఉండండి.. నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటామన్నారు. ప్రతి సంవత్సరం రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నారు. తుఫాను సమాచారం రాగానే ప్రతి జిల్లా కలెక్టర్ ను ముఖ్యమంత్రి అలెర్ట్ చేశారు.. సీఎం సూచనలతో లోతట్టు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు.. వారికి అవసరమైన తాగు నీరు ఆహారం అందించారు.. ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక, నాగార్జున సాగర్ లో నీళ్లు లేక సాగు చేయలేని దుస్థితిలో ఉన్న రైతులు కొందరైతే.. అప్పులు చేసి సాగుకు దిగితే ఇప్పుడు తుఫాన్.. రైతును ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఈ తుఫాన్ రైతాంగాన్ని ముంచేసింది.. అందుకే రైతాంగాన్ని ఆదుకునేందుకు, రైతాంగానికి అండదండగా ఉండేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు మంత్రి అంబటి రాంబాబు.