PM Modi: విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి విదితమేయ తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రాయి జగన్ కనుబొమ్మపై భాగంలో తాకింది. దీంతో ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కాగా, సీఎం జగన్ పై దాడి ఘటనపై ప్రధాని మోడీ సహా ఇతర పార్టీల నేతలు స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ స్పందించారు. మరోవైపు, తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, తదితరులు కూడా దాడి ఘటనపై స్పందించారు.
*దాడిని ఖండించిన సీఎం స్టాలిన్
ఏపీ సీఎం జగన్ పై రాయి దాడిని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఖండించారు. రాజకీయాల్లో బేధాభిప్రాయాలుంటాయని, అయితే, హింసకు తావులేదన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవాలన్నారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని స్టాలిన్ ఆకాంక్షించారు.
*త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: మమతా బెనర్జీ
జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఈ దాడి ఘటన గురించి విని షాక్‌కు గురయ్యానని, ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
Read Also: PM Modi: దేశ ప్రజలకు మోడీ గుడ్ న్యూస్..
*ఓర్వలేకే దాడులు: పేర్ని నాని
సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఇలా దాడులు చేయడానికి తెగబడ్డారని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ను ఏమీ చేయలేక రాళ్ల దాడి చేశారన్నారు. సీఎం జగన్‌కు లోతుగా గాయమైంది. రెండు కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నారు. తల నుంచి రక్తం కారుతుంటే వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. త్వరలోనే సీఎం జగన్ పై ఎవరు దాడి చేయించారో అన్నీ బయటపడతాయన్నారు.
*జగనన్న.. త్వరగా కోలుకోవాలంటూ కేటీఆర్
సీఎం జగన్‌పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు . ఆయన క్షేమంగా ఉన్నందుకు సంతోషమన్నారు. టేక్ కేర్ అన్నా అని కేటీఆర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఈ దాడి ఘటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also: Vijayasai Reddy: ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి హేయమైన చర్య
*పథకం ప్రకారమే: వైవీ సుబ్బారెడ్డి
పథకం ప్రకారమే సీఎం జగన్ పై దాడి జరిగిందని ఎంపీ వైపీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ వెంటనే దర్యాప్తు చేయాలని కోరారు. దాడి చేసిన వెంటనే చంద్రబాబు మార్క్ రాజకీయం మొదలు పెట్టారన్నారు. సీఎంపై దాడిని కూడా డ్రామా అనడం బాబు నైజమన్నారు. విచారణ వేగంగా జరుగుతుందని..
వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.
*హేయమైన చర్య: డిప్యూటీ సీఎం అంజద్ భాష
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి హేయమైన చర్యని డిప్యూటీ సీఎం అంజద్ భాష ఖండించారు. కూటమి నేతల కట్టలు కట్టుకుని వచ్చిన భయపడే ప్రసక్తి లేదన్నారు. విజయవాడలో జనాదరణను చూసి ఓర్వలేకనే దాడులకు దిగారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన బస్సు యాత్ర చేసి తీరుతామన్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
*ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి కారుమూరి
సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆదరణ తట్టుకోలేక టీడీపీ నాయకులు దాడి చేయడం సిగ్గుచేటని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఖండించారు. చంద్రబాబు నాయుడు అధికారులకు వస్తే ప్రజలకు మేమేం చేస్తామని చెప్పాలి తప్ప, కానీ వారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే సరిపోతుందన్నారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని మే 13 వ తారీఖుని రాష్ట్ర ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో 31, లక్షల ఇళ్లస్థలాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిది అంటూ పేర్కొన్నారు.
*ఓర్వలేకనే: మంత్రి ఆదిమూలపు సురేష్
సీఎం జగనన్న పైన జరిగిన దాడి వార్త బాధ కలిగించిందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. జగనన్నకు రాష్ట్రంలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ దాడులకు దిగుతోందన్నారు. బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతోందన్నారు. టీడీపీ నేతలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందన్నారు. అక్కడక్కడా దాడులకు పాల్పడి అల్లర్లు సృష్టించాలని పథకాలు రచిస్తున్నారన్నారు. రెండు రోజుల క్రితం ఒంగోలులో గొడవకు దిగారన్నారు. ఇప్పుడు ఏకంగా సీఎంపైనే దాడికి దిగి వారి నైజం బయటపెట్టుకున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎన్నికల్లో ఓటు అనే అస్త్రం ఉపయోగించి టీడీపీకి తగిన బుద్ది చెబుతారన్నారు. ఇలాంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.