మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొననుండడం సంచలనంగా మారింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై అసంతృప్తితో మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే.. మరో 11 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్‌లో సూరత్‌కు వెళ్లినట్లు సమాచారం. తన వెంట 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏక్‌నాథ్ షిండే తెలిపినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. వీరంతా గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సూరత్‌లోని గ్రాండ్ భగవతీ హోటల్‌లో ఆ ఎమ్మెల్యేలు బస చేస్తున్నట్లు అక్కడి విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో శివసేనలో చీలిక మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ అప్రమత్తమైంది. అత్యవసర సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుంది.
మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10 స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఐదుగురు గెలుపొందారు. బీజేపీకి మొత్తం 134 ఓట్లు వచ్చినట్లు బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు. బీజేపీకి అసెంబ్లీలో నలుగురిని గెలుచుకోగల సంఖ్యాబలం 106 కాగా.. 134 ఓట్లు వచ్చాయి. ఐదుగురిని బరిలోకి దించి పూర్తిస్థాయిలో విజయం సాధించింది. అంటే స్వతంత్రులతో పాటు అధికార పక్షం వారివీ ఉంటాయని భావిస్తున్నారు. కూటమిలోని మూడు పక్షాలు రెండేసి చొప్పున ఆరు స్థానాల్లో పోటీ చేసి ఐదుగురిని మాత్రమే గెలుపించుకోగలిగాయి.
ఏక్‌నాథ్ షిండే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూడా లేరని శివసేన నేత ఒకరు తెలిపారు. దీనిని బట్టి చూస్తే అధికార పార్టీ నేత షిండే తిరుగుబాటు బావుటా ఎగరవేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు శివసేన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి షిండే వస్తారో రారో వేచి చూడాల్సిందే.
మరోవైపు మహారాష్ట్రలో 288 స్థానాలకు గానూ సంకీర్ణ ప్రభుత్వానికి 169 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 113 సీట్లతో భాజపా రెండో స్థానంలో ఉంది. ఒకవేళ ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరినా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోదు. మహా వికాస్ అఘాడీకి మెజార్టీ కంటే ఎక్కవ స్థానాలే ఉన్నాయి. కానీ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో భాజపాకు లాభం చేకూరే అవకాశం ఉంది.