Fines For Cancelling Rides: ఈ మధ్య కాలంలో ఎక్కడికి ప్రయాణించాలన్నా ఓలా, ఉబర్ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. సిటీలలో ఎక్కువ మంది వీటిపైనే ఆధారపడుతున్నారు. మనం ఉన్న చోటుకే వచ్చి తీసుకొని వెళ్లడం, కావాల్సిన చోట దించడంతో వీటిని ఉపయోగించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉండటంతో ఎక్కువ మంది వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. కేవలం మన చేతిలో ఉన్న మొబైల్ సాయంతోనే వీటిని బుక్ చేసుకోవచ్చు. ఏ సమయంలో అయినా ఇవి అందుబాటులో ఉంటాయి. అయితే ఇన్నీ ఉపయోగాలు ఉన్నా కూడా కొన్ని సార్లు వీటి వల్ల కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. రైడ్ ను తీసుకున్న తరువాత డ్రైవర్లు వారి రైడ్ ను క్యాన్సిల్ చేస్తున్నారు. దీని వల్ల చాలా సమయం వేస్ట్ అవుతుంది. రెగ్యూలర్ గా ఇలా రైడ్స్ బుక్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఏదో ఒకసారి ఈ సమస్య ఎదురయ్యే ఉంటుంది. దీనికి సంబంధించి ఫిర్యాదులు ఎక్కువైపోయాయి.
Also Read: RBI About Rs 2000 Notes: రూ. 2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
ఈ నేపథ్యంలో ఈ అంశంలో సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.కస్టమర్స్ నుండి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఈ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది.కస్టమర్ రిక్వెస్టుని అంగీకరించి ఆ తరువాత రైడ్ క్యాన్సిల్ చేసే క్యాబ్ డ్రైవర్లకు జరిమానా విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు చేసింది. డ్రైవర్ రైడ్‌ను రద్దు చేసిన ప్రతిసారీ బాధిత ప్రయాణీకుడికి రూ. 50 నుండి 75 వరకు రాయితీని అందించాలని స్పష్టంచేసింది. సాధారణంగా రైడ్ ను బుక్ చేసి క్యాన్సిల్ చేస్తే కస్టమర్ కు ఫైన్ విధిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇది డ్రైవర్ కు కూడా వర్తించనుంది. అంతేకాకండా వెయిటింగ్ టైమ్ విషయంలో కూడా ఈ కమిటీ కొన్ని మార్గదర్శకలు చేసింది. వెయిటింగ్ టైమ్ 20 నిమిషాలకు మించి ఉంటే ఆ సమయానికి కూడా సూచించిన విధంగా రాయితీని అందించాలని పేర్కొంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం డ్రైవర్ వెయిట్ చేయించి రైడ్ క్యాన్సిల్ చేసినా కూడా ఆ ఫైన్ కస్టమర్ కు పడుతుంది. దీంతో ఈ సమస్యకు సంబంధించిన అనేక ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఇక ఈ కమిటీ సిఫార్సులు అమలులోకి వస్తే కస్టమర్లకు భారం తగ్గినట్లే అవుతుంది.