93 percent 2000 Rupee Notes returned: రూ. 2 వేల నోట్లను తాత్కాలికంగా చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఈ ఏడాది మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువునిచ్చింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఇక దీనికి సంబంధించే ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే 93 శాతం 2 వేల రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని స్పష్టంచేసింది. ఆగస్టు 31వ తేదీ నాటికి నమోదైన లావాదేవీల ప్రకారం ఈ వివరాలు వెల్లడిస్తున్నట్టు ఆర్బీఐ తమ తాజా ప్రకటనలో పేర్కొంది.
Also Read: Moody’s Report: భారత్ కు గుడ్ న్యూస్.. పెరిగి వృద్ధి రేటు అంచనాలు
బ్యాంకుల నుంచి వచ్చిన డేటా ప్రకారం వెనక్కి వచ్చిన రూ. 2 వేల నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలోనూ, మిగిలిన 13 శాతం ఇతర కరెన్సీ నోట్ల ఎక్స్చేంజ్ కింద వచ్చినట్లు తెలిపింది. ఆగస్టు 31 నాటికి బ్యాంకులకు చేరుకున్న రూ. 2,000 నోట్ల విలువ రూ. 3.32 లక్షల కోట్లు అని ఆర్బీఐ పేర్కొంది. ఇంకా చెలామణీలో మిగిలిన రూ. 2 వేల నోట్ల విలువ కేవలం రూ.24 వేల కోట్లు మాత్రమేనని తెలిపింది. ఇక ఈ రూ. 2000 నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే . వాటి ప్రకారం.. ఎవరైనా ఒక వ్యక్తి ఒక్క రోజుకు బ్యాంకు నుంచి రూ. 20,000 వరకు.. అంటే 10 నోట్లు వరకు మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఉంది. అయితే రూ. 2000 నోట్ల డిపాజిట్స్ పై మాత్రం పరిమితి లేదు. అయినప్పటికీ ఎక్కువ రెండు వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేసే వారు తమ పాన్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఏవైనా అవకతవకలు ఉన్నట్లు గుర్తిస్తే ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది డిపాజిట్ చేయలేకపోతున్నారు. తరువాత ఏదైనా ప్రాబ్లమ్ అయితే వాటికి సంబంధించి ట్యాక్స్ కట్టిన వివరాలు, ఎక్కడ నుంచి సంపాదించారు ఇలా అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా వుండగా ఈ నెలతో రూ. 2000 నోట్లు మార్చకునే గడువు ముగుస్తుండగా అన్ని నోట్లను మార్చుకోవాలని ఆర్బీఐ కోరుతుంది.