ఇవాళమాఘ పౌర్ణమి. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాఘ పూర్ణిమకు భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పుణ్య నదులలో స్నానం చేయడం.. దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ప్రతి నెలా వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈసారి మాఘ పౌర్ణమి రోజున రవి పుష్యయోగంతో పాటు ఇంకా ఎన్నో శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగంలో రాముడు కూడా జన్మించాడని, అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతారు. ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభించినా కచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు.
Read Also: Himanta Biswa Sarma: బాబర్ ఆక్రమణను తొలగించి రామమందిరాన్ని నిర్మించాం..
మాఘ పౌర్ణమి నాడు కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. భద్రాద్రిలో నేడు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మాఘ పౌర్ణమి సందర్భంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. ఇటు కాకినాడలో మాఘ పౌర్ణమి ఆదివారం కావడంతో అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ లైన్ లలో దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్నారు భక్తులు. పెళ్లిళ్లు సీజన్ కావడంతో వసతి గదులు కొరత కనిపిస్తోంది. అనకాపల్లి జిల్లా పూడిమడక ,రాంబిల్లి,బంగారమ్మపాలెం సముద్ర తీరాలవద్ద మాఘపౌర్ణమి సందడి ఏర్పడింది.
మాఘపౌర్ణమి పుణ్యస్నానాలకై తెల్లవారు ఝామునుండే భారీగా తరలి వచ్చారు భక్తులు. భక్తుల సౌకర్యార్ధం మాఘపౌర్ణమి జాతర పేరుతో ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్నానాలాచరించే తీరాల వద్ద గజఈతగాళ్లను సిద్ధం చేశారు పోలీసులు. తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మాఘ పూర్ణిమ నాడు పూజను సాయంత్రం ప్రారంభించేందుకు ఉత్తమ సమయంగా పండితులు చెబుతున్నారు. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి. చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్