Himanta Biswa Sarma: ఎన్నికల నేపథ్యంలో త్రిపురలో జరిగిన ర్యాలీలో అసోం ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని రామజన్మభూమిలో బాబర్ ఆక్రమణను తొలగించి బీజేపీ రామమందిరాన్ని నిర్మించిందని బనమాలిపూర్‌లో జరిగిన బహిరంగ సభలో హిమంత బిస్వా శర్మ అన్నారు. రాముడు జన్మించిన ప్రదేశాన్ని బాబర్ స్వాధీనం చేసుకున్నాడని అసోం ముఖ్యమంత్రి శుక్రవారం త్రిపురలో అన్నారు. “మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రామజన్మభూమి వద్ద రామమందిరాన్ని నిర్మించాలని మేము సంకల్పించాము. రాముడు జన్మించిన భూమిని బాబర్ ఆక్రమించుకున్నాడు. ఈ రోజు మేము బాబర్‌ను తొలగించి గొప్ప రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించాము” అని అసోం ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో శాంతి, సామరస్యాలు నెలకొల్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
ఇంతకు ముందు ప్రజలకు విశ్వాసం ఉండేది కాదు.. ఎవరైనా రామమందిర నిర్మాణానికి శ్రీకారం చుడితే హిందువులు, ముస్లింల మధ్య మత ఘర్షణలు తలెత్తుతాయని ప్రజలు భావించారని, ఇప్పుడు మోడీ జీని చూడండి.. ఒకవైపు రామమందిరం నిర్మిస్తున్నారని అన్నారు. మరోవైపు, హిందువులు, ముస్లింల మధ్య సోదరభావం దెబ్బతినలేదు. ఫలితంగా దేశం పురోగమిస్తోందన్నారు. ఈ నెలాఖరులో త్రిపురలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధిస్తుందని హిమంత బిస్వా శర్మ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఐ (ఎం)లు తుడిచిపెట్టుకుపోతాయని శర్మ పేర్కొన్నారు. త్రిపురలోని సూర్యమణి నగర్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, వచ్చే వారంలో త్రిపుర ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసే అవకాశం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో త్రిపురలో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. రెండు దశాబ్దాలకు పైగా మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా ఉన్న వామపక్ష కంచుకోట. ఎన్నికల విజయం తర్వాత, బీజేపీ త్రిపుర ముఖ్యమంత్రిగా బిప్లబ్ దేబ్‌ను నియమించింది. మే 2022లో అతని స్థానంలో మాణిక్ సాహాను ముఖ్యమంత్రిగా నియమించింది.
Pakistan: సైన్యం, న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష
త్రిపురలో మరో విజయాన్ని నమోదు చేసేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఐదు అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిన మాజీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT)తో పొత్తు పెట్టుకుంది. ఫిబ్రవరి 16న జరగనున్న ఈశాన్య రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 55 మంది అభ్యర్థులను నిలబెట్టింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా 11 మంది మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు లభించాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. నాగాలాండ్, మేఘాలయతో పాటు మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.