Rythu Nestham : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన ‘రైతునేస్తం’ కార్యక్రమం సోమవారం (జూన్ 17) ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు వేదికల తయారీ, సాంకేతిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు మంత్రి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
Vijay Rupani: నేడు అధికారిక లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు
వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ, రైతునేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు, అలాగే విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో సుమారు 1,500 మంది రైతులు ప్రత్యక్షంగా హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించబడి ఉండగా, తాజాగా మరో 1,034 వేదికల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రతీ మంగళవారం నిర్వహించే రైతునేస్తం ద్వారా శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఆదర్శరైతుల అనుభవాలు, కొత్త పంటల సాంకేతికతపై చర్చలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు.
ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా 6.35 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను ఆహ్వానించినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.