నేడు ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో హైకోర్టు తీర్పు సీల్డ్ కవర్‌ను అధికారులు తెరవనున్నారు. కవర్‌లో విజేత ఎవరనేది తేలనుందా? లేక టాస్ వేయాల్సిన అవసరం వస్తుందా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఫలితంపై హైకోర్టు నుంచి సీల్డ్ కవర్ వచ్చి దాదాపుగా 30 రోజులు అవుతోంది. దాంతో ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: CM Chandrababu: నేడు విశాఖకు సీఎం చంద్రబాబు!
2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ పార్టీలు సమానంగా 14, 14 సీట్లు గెలిచాయి. అప్పటి టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటు చెల్లదని వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. కేశినేని నాని ఓటు చెల్లుతున్నట్టు హైకోర్టు తీర్పు ఇస్తే.. చైర్మన్ పీఠం టీడీపీ సొంతం అవుతుంది. ఒకవేళ కేశినేని నాని ఓటు చెల్లుబాటు కాదని తీర్పు వస్తే.. టాస్ వేసి ఎవరు చైర్మన్ అనేది ప్రకటించే అవకాశం ఉంది. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నిక ఫలితం మూడన్నరేళ్లుగా కోర్టు పరిధిలో ఉంది. నేడు మున్సిపాలిటీ చైర్మన్ ఎవరన్నది తేలిపోనుంది.