KRMB Meeting: కృష్ణా జలాల్లో నీటి వాటాలను తేల్చకుండానే కేఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. నదీ జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని తెలంగాణ వాదిస్తే.. 66:34 నిష్పత్తిలో ఉండాలని ఏపీ వాదిస్తోంది. ఇదిలా ఉండగా.. కేంద్రం తొమ్మిదేళ్ల నుంచి నీటి వాటాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది. తాత్కాలిక సర్దుబాటు 66:34 తమకు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ స్పష్టం చేస్తోంది. నీటి వాటా ఖరారు అంశాన్ని ట్రైబ్యునల్‌కు నివేదించామని, 811 టీఎంసీల్లో చెరోసగం కేటాయించాల్సిందేనని తెలిపింది. పాలమూరు-రంగారెడ్డిపై కేంద్రం సరిగా స్పందించడం లేదని.. పట్టిసీమ గోదావరి జలాల మళ్లింపులో తమకెందుకు వాటా ఇవ్వరని ప్రశ్నించారు తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్. అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని.. తెలంగాణలోని ఓ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, బోర్డు బడ్జెట్‌పై చర్చ జరిగింది. గెజిట్ నోటిఫికేషన్, హిందీ అమలు, ఏపీకి కార్యాలయం తరలింపు, జల విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి లెక్కింపు, ఆర్డీఎస్‌పై చర్చించారు అధికారులు. కేఆర్‌ఎంబీ కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎలాంటి నీటి వాటా ఖరారు చేయలేదని, 66:34 నిష్పత్తిలో నీటివాటా ఉండాలని ఆంధ్రప్రదేశ్ కోరినట్లు తెలిపారు ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలు మాత్రమే తీసుకోవాలన్న వాదన సరికాదన్నారు. విద్యుత్ ఉత్పత్తి కంటే సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటున్న ఏపీ అధికారులు.. కృష్ణా బోర్డును త్వరలో విశాఖకు తరలిస్తామని చెబుతున్నారు.
Read Also: Minister Kakani Govardhan Reddy: పవన్‌కు 10 పంటలు చూపిస్తే 5 కూడా గుర్తుపట్టలేడు..
హైదరాబాద్ జలసౌధలో నిన్న సుదీర్ఘంగా జరిగిన కృష్ణా నది యాజమాన్య బోర్డు 17వ సమావేశం తీవ్ర వాదోపవాదాల మధ్య కొనసాగింది. బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఏపీ జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు. 22 అంశాలున్న ఎజెండాపై జరిగిన ఈ సమావేశంలో అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలలో చిన్న నీటి వనరులను మినహాయించి మిగిలిన నీటిని 66:34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వినియోగించుకొంటుండగా, వచ్చే నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో కేటాయింపులు ఉండాలని తెలంగాణ కోరింది. దీనిపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్ణయం కోసం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామని ఛైర్మన్ ప్రకటించారు. కేంద్రం నుంచి నిర్ణయం వచ్చేవరకు నీటి విడుదలపై ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకొంటుంది. ఈ కమిటీలో బోర్డు సభ్యుడితో పాటు రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. 2022-23వ నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో నీటి వినియోగం ఉండాలన్న తెలంగాణ ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.