Srikakulam: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. భక్తుల రద్దీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు అసలు కారణాలు.. ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు.. ఇది పూర్తిగా ప్రైవేట్ ఆలయం అని స్పష్టం చేశారు.. శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదని వెల్లడించారు. అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? నిర్మించడానికి గల కారణం ఏంటి? అనే పలు అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Botsa Satyanarayana: ప్రభుత్వంలోని పార్టీలు సనాతన ధర్మం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పాయి..
ఈ గుడిని నిర్మించిన వ్యక్తి పలాసకు చెందిన హరిముకుంద పండా.. గత నాలుగు నెలల కిందటే ఈ గుడి నిర్మాణం చేపట్టారు. తాను తిరుమలకు వెళ్లినప్పుడు శ్రీవారి దర్శనం జరగలేదని అందుకే పలాసలోని తన వ్యవసాయ భూమిలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు గతంలో వెల్లడించారు. శ్రీనివాసుడి దర్శనం కాకపోతే మరోసారి వెళ్లాలి గానీ.. ఏకంగా మరో గుడి నిర్మించడం ఏంటని ఆయణ్ణి పలువురు ప్రశ్నించారు. “శ్రీవారంటే నాకు చాలా ఇష్టం. ఏడాదిలో రెండు సార్లు దర్శనం కోసం వెళ్లే వాడిని.. చాలా బాగా దర్శనం జరిగేది. కానీ.. సారి చాలా ఏళ్ల తరువాత వెళ్లాను. అంటే గత పదేళ్ల కిందట తిరుమలకు వెళ్లాను. ఈ సారి అక్కడ మొత్తం మారిపోయింది. నేను నా గుమస్తా కలిసి వెళ్లగా క్యూ లైన్ 9 గంటలకు మొదలైంది. రెండు గంటలకు కూడా గుడిలోకి పోలేక పోయాం. శ్రీవారిని చూసేలోపే అక్కడున్న సిబ్బంది తోసేశారు. దర్శనం సరిగ్గా కాలేదు. ఈ అంశాన్ని మా అమ్మతో చెప్పాను. దీంతో మా అమ్మ గుడి 12 ఎకరాల 40 సెంట్ల భూమిని దేవుడి పేరిట రాసేశారు. దీంతో ఆ స్థలంలో ఇటీవల గుడిని నిర్మించాను. 9 అడుగుల 9 అంగుళాల దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టించాం. శ్రీదేవి, భూదేవిని కూడా అక్కడి నుంచే తెచ్చాం.” అని పండా వివరించారు. శాస్త్రాలు, పురాలనాల ప్రకారం విగ్రహ ప్రతిష్ట జరిగిందని పండా వెల్లడించారు. తన మరణానంతరం తన కుమారుడు బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు.