Jasprit Bumrah: కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు శస్త్రచికిత్స పూర్తయినట్లు తెలుస్తోంది. శస్త్ర చికిత్స కోసం బుమ్రాను బీసీసీఐ న్యూజిలాండ్‌కు పంపిచింది. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్), షేన్ బాండ్ (న్యూజిలాండ్)కు సర్జరీ చేసిన డాక్టర్ రోవన్ షౌటెన్.. బుమ్రాకు చికిత్స అందించాడు. ఆ సర్జరీ విజయంవంతం అయిందని క్రిక్ బజ్ ఓ నివేదికలో తెలిపింది. అయితే, బుమ్రా పూర్తిగా కోలుకుని మైదానంలోకి వచ్చి మళ్లీ ఆడాలంటే దాదాపు ఆరునెలల సమయం పట్టొచ్చు. దీంతో బుమ్రా డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియా కప్‌లకు దూరం కానున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే అక్టోబర్, నవంబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కొచ్చు.
Read Also: Khushboo Sunder: నా తండ్రి నీచుడు.. అందుకే సిగ్గులేకుండా చెప్పా
న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చ్ పట్టణంలో బుమ్రాకు శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు, దీని నుంచి ఆయన కోలుకుంటున్నట్లు క్రిక్ బజ్ వెల్లడించింది. బీసీసీఐ పర్యవేక్షణలోని బుమ్రాకు ఈ శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా పూర్తిగా కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రాబోయే ఐపీఎల్, ఆ తర్వాత జరిగే ఆసియా కప్‌లో కూడా బుమ్రా ఆడే అవకాశం లేదు. గత ఆగస్టులో గాయపడ్డ బుమ్రా అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్-2022, టీ20 వరల్డ్ కప్, తాజా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక టోర్నీలకు కూడా బుమ్రా దూరమయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీకి కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇది ఐపీఎల్‌లో బుమ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. సర్జరీ పూర్తైన బుమ్రా కనీసం 24 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. దీంతో కనీసం సెప్టెంబర్ వరకు అతడు ఆటకు దూరంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఆ తర్వాత స్వదేశంలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్‌కు మాత్రమే బుమ్రా అందుబాటులోకి వస్తాడు. అంటే ఏడాదికిపైగా బుమ్రా జాతీయ జట్టుకు దూరమవుతున్నాడు.