Pawan Kalyan: జనసేన విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ప్రత్యేక పరిస్థితుల్లో విస్తృత స్థాయీ సమావేశం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దుర్మార్గపు పాలనను కొత్తగా వచ్చిన పదేళ్ల పార్టీ ఎలా ఎదుర్కొబోతోందో తరచి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. జనసేన బలంగా నిలబడుతోందని పవన్ తెలిపారు. రాజ్యాంగంలో ఇండియా దటీజ్ భారత్ అని ఉందని.. సైరా సినిమా సందర్భంలోనే నేను భారత్ అనే పేరు ఉంటే బాగుంటుందని చెప్పానన్నారు. జీ-20 సదస్సులో ప్రధాని భారత్ అనే పేరు పెట్టడం సంతోషం కలిగించిందన్నారు. తాను భారతీయుడిలా మాట్లాడుతున్నానన్నారు. సనాతన ధర్మం తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుందన్నారు. ప్రజల కోసం కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సనాతన ధర్మం మసలుకుంటుందన్నారు.
Also Read: Minister Amarnath: పవన్ చెపితే కాపులు ఎందుకు టిడిపికి ఓటు వేస్తారు..!
ద్వేషంతో కూడుకున్న వాదనలు.. వ్యక్తులు కాల గర్భంలో కలిసిపోతారని జనసేన అధినేత పవన్ అన్నారు. అతి తెలివితేటలు.. కృూరత్వంతో ఉన్న వారిని రాజకీయం అంటే వ్యాపారం చేసే వారిని అడ్డుకోవాలన్నారు. సీఎం అయితే ఏదైనా చేసేయొచ్చు.. ఆదేశిక సూత్రాలు పాటించనక్కర్లేదనే పిచ్చ కొందరికి ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసినా చెల్లుతుందనే భావన పోవాలన్నారు. నేనే సంక్షేమం తెచ్చాననే ఆలోచన కరెక్ట్ కాదన్నారు. ఇష్టానికి పాలన చేసే వైసీపీ ప్రభుత్వానికి.. వారికి అండగా ఉండే అధికారులకు కనువిప్పు కలగాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉండే అధికారులు సిగ్గు పడాలన్నారు. ఫ్లైట్లో వస్తున్నా.. రోడ్ మార్గం ద్వారా వస్తున్నా ఆపేస్తారా అంటూ ప్రశ్నించారు. అధికారులకు సరదాగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మారకుంటే వీరభద్రుల్లా మారతామన్నారు. తెలంగాణకు వెళ్లాలంటే పాస్ పోర్టు కావాలనే పరిస్థితి వస్తుందని వైఎస్ అన్నారు. కానీ ఏపీకి పాస్ పోర్టు తీసుకునే పరిస్థితి తెచ్చారన్నారు. తండ్రి కోరికను తనయుడు నెరవేర్చారన్నారు. ఎన్ని కేసులు పెడతారు..? ఇది సబబా..? అంటూ మండిపడ్డారు. కేసులు పెడితే మేం భయపడతామా అంటూ పవన్ అన్నారు. ప్రజలకు కోపం వస్తే కొట్టి కొట్టి చంపేస్తారన్నారు.
పవన్ మాట్లాడుతూ..” ప్రజల కోపం చాలా దారుణంగా ఉంటుంది. అధికారులు పరిస్థితిని అర్థం చేసుకోవాలి ప్లీజ్. ఉత్తి పుణ్యానికి 87 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిపేస్తారా..?ప్యాలెస్సులో ఉన్న వారిని రోడ్ల మీదకు లాక్కురావడం కష్టమనుకుంటున్నారా..? నువ్వెంత.. నీ బతుకెంత.. నీ స్థాయెంత..? వ్యవస్థలు పని చేయనప్పుడు.. ప్రజలే పని చేయాలి. రాజకీయ పార్టీలు కూడా భయపడే పరిస్థితి వస్తే ప్రజలే ముందుకు రావాలి.జగన్‌కు ఎందుకు భయపడాలి..? జగన్ కూడా ఓ సాధారణ మనిషే. లోకేష్, బాలకృష్ణ మధ్యలో కూర్చొని మాట్లాడే పరిస్థితి కల్పించిందెవరు..? చంద్రబాబుతో అమరావతి భూముల విషయంలో విబేధించాను. ప్రజాస్వామ్యంలో ఓ మాట మాట్లాడినా చంద్రబాబు వింటారు.. అందుకే చంద్రబాబును గౌరవిస్తాను. బీజేపీతో పొత్తును రకరకాల కారణాల వల్ల సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోయామోననేది మీకూ తెలుసు.. నాకూ తెలుసు. ఎవరి బలం వారికి ఉంది. పవన్ కళ్యాణ్‌గా నాకు వ్యక్తిగతంగా బలముంది.. కానీ జనసేన పార్టీ పరంగా ఎంత బలముందో ఆలోచించుకోవాలి. వైసీపీలో చాలా మంది సీనియర్ నేతలున్నారు.. టీడీపీ నలభై ఏళ్ల అనుభవం ఉన్న పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో మనకున్న బలంతో పోరాడడం మామూలు విషయం కాదు. ఈగో ముఖ్యమా..? రాష్ట్రం ముఖ్యమా..? అని ఆలోచించాలి. నాకైతే రాష్ట్రమే ముఖ్యం. ఢిల్లీ వెళ్తాను.. అమిత్ షాను కలుస్తాను. ఏ నేపథ్యంలో రాజమండ్రి ప్రకటన చేయాల్సి వచ్చిందో వివరిస్తాను. ఎన్డీఏలో ఉన్నాను కాబట్టి.. టీడీపీతో పొత్తు అంశాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా మంది అభినందిస్తున్నారు.” అని ఆయన అన్నారు.
Also Read: Nara Brahmani: చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే నేరమా..?
మన సమకాలికులను.. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయొద్దని పవన్ పేర్కొన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నారని తెలుగుదేశం నేతలను కించపరచవద్దన్నారు. పొత్తులకు తూట్లు పొడిచేలా ఎవ్వరూ వ్యవహరించొద్దన్నారు. “రాహుల్ గాంధీని పప్పు పప్పు అని విమర్శించారు. కానీ అదే రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు. నేను కాంగ్రెస్ మద్దతు దారును కాను.. కానీ ఎదుటి పక్షాన్ని తక్కువ అంచనా వేయొద్దనే చెబుతున్నా. కాంగ్రెస్ కూటమిని నేను తక్కువ అంచనా వేయడం లేదు. వైసీపీని తక్కువ అంచనా వేయొద్దు. వైసీపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలి. అది మళ్లీ రాకుండా చేయాలి. ఆ పార్టీని రాజకీయాల్లో లేకుండా చేయాలి. తిట్టాలన్నా పేపర్ చూడాల్సిందేనా..? తిట్టాలన్నా.. దద్దమ్మలు అంటూ చూసి మరీ చదువుతారు. ఏపీని మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తి చేతిలో పెట్టడం కరెక్ట్ కాదు. జగన్‌కు మానసిక బలం ఉందని వైసీపీ నేతలు అనుకుంటున్నారేమో.. అది పిచ్చ. వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయడానికి ఇదే సరైన సమయం.” అని పవన్ పేర్కొన్నారు.
సమన్వయ కమిటీ అధ్యక్షునిగా నాదెండ్ల మనోహర్
2024 ఎన్నికల్లో జనసేన బలమైన స్థానాలకో ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెడుతోందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ షేరింగు తీసుకునే జనసేన వెళ్తోందన్నారు. జనసేన అసెంబ్లీలోకి అడుగు పెట్టిన రోజున ఏపీ చరిత్ర మార్చేస్తుందన్నారు. “పార్లమెంటులో జనసేన అడుగుపెట్టబోతోంది. తెలుగుదేశంతో ఎలా అధికారం పంచుకుందాం..? అది సీఎం స్థానమా..? లేక మంత్రులా..? ఇవన్నీ ఆలోచించే ముందు మనం గెలవాలి కదా..? మనం గెలిస్తేనే అధికారంలో భాగస్వామ్యం కాగలం. పగటి కలలు కనొద్దు.. ముందు జగన్ను రాష్ట్రం నుంచి తరిమేయాలి. జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమేశాక పవర్ షేరింగ్ గురించి ఆలోచిద్దాం.” అని ఆయన పేర్కొన్నారు. టీడీపీతో సమన్వయం చేసుకునే బాధ్యత నాదెండ్లకు అప్పజెబుతున్నామన్నారు జనసేనాని పవన్. సమన్వయ కమిటీ అధ్యక్షునిగా నాదెండ్ల మనోహర్‌ను నియమిస్తుమన్నారు. జనసేన ఎన్డీఏలోనే ఉందన్నారు. మనం బీజేపీతోనే ఉన్నాం.. ఈ విషయం చాలా గట్టిగా చెప్పాలని జనసైనికులకు సూచించారు.
“2009 నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు.. 2024లో సాకారం కాబోతోంది. సింహం సింగిల్ అంటూ తొడలు కొడుతున్నారు.. తొడలు వాస్తాయి. అధికారులు ఆలోచించుకోవాలి.. ఆరు నెలల్లో మా ప్రభుత్వం వస్తోంది. మేం విసిగిపోయాం.. గొడవే కావాలంటే మేమూ సిద్దమే. రాబోయే జనసేన-టీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి మద్దతివ్వాలి. తెలంగాణలో మనం పోటీ చేయాలి. ఎలా పోటీ చేయాలి.. ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది ఆలోచిద్దాం.” అని పవన్ అన్నారు.
ప్రధానిని.. అమిత్ షాను ఉద్దేశించి సమావేశం చివర్లో ఇంగ్లిషులో ప్రసంగించిన పవన్.
జీ-20 సదస్సు సక్సెస్ అయినందుకు ప్రధాని మోడీకి పవన్ అభినందనలు తెలిపారు. భారత్ ప్రధానిగా మోడీని మళ్లీ చూడాలనుకుంటున్నామన్నారు. మేం ఎన్డీఏతోనే ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే మా ఎంపీలంతా ఎన్డీఏలోనే ఉంటారు.. ఇది నా ప్రామిస్ అంటూ పవన్ పేర్కొన్నారు. ఏపీకి మోడీ, అమిత్ షా ఆశీస్సులు కావాలన్నారు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. ఏపీ రాజధాని అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేలా కేంద్రం సహకారం అవసరమన్నారు. మూడు రాజధానులు కాకుండా.. మూడు ప్రాంతాల అద్భుత అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమన్నారు.