Iranian border forces kill 11 Afghan refugees: ఇరాన్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 11 మంది ఆఫ్ఘన్ శరణార్థులు ఇరాన్ సరిహద్దు దళాల చేతిలో చంపబడ్డారని ఖామా ప్రెస్ నివేదించింది. ఇరాన్ సరిహద్దు దళాలు శుక్రవారం పదకొండు మంది ఆఫ్ఘన్ పౌరుల మృతదేహాలను నిమ్రోజ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద తాలిబాన్ అధికారులకు అప్పగించారు. నాలుగు రోజుల క్రితం, సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో అక్రమంగా ఇరాన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న పదకొండు మంది ఆఫ్ఘన్ పౌరులను ఇరాన్ భద్రతా దళాలు కాల్చి చంపాయి. మరణించిన ఆఫ్ఘన్ జాతీయులు దాదాపు 20 సంవత్సరాల వయస్సు గలవారు. వీరు ఇద్దరికి 18 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇరాన్ అధికారులు, తాలిబాన్ అధికారులు ఈ హత్యలకు సంబంధించి ఇంకా స్పందించకపోవడం గమనార్హం.
నిమ్రూజ్ ప్రావిన్స్‌లోని తాలిబన్లు గత పదకొండు నెలల్లో, ఈ ప్రావిన్స్ ద్వారా 470 మందికి పైగా ఆఫ్ఘన్ శరణార్థుల మృతదేహాలను దేశానికి తరలించారని చెప్పారు. ఈ వ్యక్తులు అనేక సంఘటనలలో మరణించారని తాలిబాన్ అధికారులు పేర్కొన్నారు. ఇరాన్ గత వారంలో 7,612 మంది ఆఫ్ఘన్ శరణార్థులను వారి స్వదేశానికి తిరిగి పంపించిందని నిమ్రూజ్ ప్రావిన్స్‌లోని రెఫ్యూజీ అండ్ రీపాట్రియేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన తాలిబాన్ అధికారులు వెల్లడించారు.
Read Also: Marriage: మద్యం మత్తులో మండపానికి వెళ్లడం మర్చిపోయిన పెళ్లికొడుకు.. చివరకు!
గత వారం బలూచిస్థాన్‌లో తమ వాహనంపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయని, దాని ఫలితంగా వారిలో ఒకరికి గాయాలయ్యాయని కొందరు ఆఫ్ఘన్ శరణార్థులు చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఆగష్టు 2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌పై నియంత్రణ తీసుకున్నప్పటి నుండి, అనేక మంది ఆఫ్ఘన్ జాతీయులు, తాలిబాన్‌ల మరణ బెదిరింపులు, హింసలకు భయపడి ఇరాన్, పాకిస్తాన్‌తో సహా పొరుగు దేశాలకు వలస వచ్చారు. ఈ వలసదారులలో ఎక్కువ మంది అక్రమ మార్గాల ద్వారా పొరుగు దేశాలలోకి ప్రవేశించినందున, ఇప్పుడు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇరాన్, పాకిస్తాన్ దశాబ్దాలుగా మిలియన్ల మంది ఆఫ్ఘన్‌లకు వసతి కల్పించినప్పటికీ, ఇప్పుడు పత్రాలు లేని ఆఫ్ఘన్ జాతీయులతో వ్యవహరించడానికి తీవ్రమైన చర్యలు తీసుకున్నాయి. లీగల్ స్టే పర్మిట్‌లు లేదా వీసాలు అందించడంలో విఫలమైన ఆఫ్ఘన్ శరణార్థులను ఇరాన్ ముఖ్యంగా వారానికోసారి బలవంతంగా బహిష్కరిస్తుంది. అదనంగా, ఇరాన్, పాకిస్తాన్ అనేక సందర్భాల్లో ఆఫ్ఘన్ శరణార్థులను దుర్వినియోగం చేయడం ద్వారా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించాయని ఆరోపించారు.