రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2025 కోసం వెస్టిండీస్ హిట్టర్ రొమారియో షెపర్డ్ భారత్‌కు వచ్చేశాడు. ఈ విషయాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మెంటర్ డ్వేన్ బ్రావో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపాడు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో విండీస్ వెళ్లిన షెపర్డ్.. తిరిగి భారత్ చేరుకున్నాడు. వాయిదా పడిన ఐపీఎల్ 2025 ఈ నెల 17 నుంచి పునః ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
రొమారియో షెపర్డ్ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. చెన్నైపై ఒకే ఓవర్లో 30 పరుగులు చేసి ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆర్సీబీ ఆటగాడిగా షెపర్డ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్‌తో మే 29న వన్డే సిరీస్ ప్రారంభం అవుతుండగా.. వెస్టిండీస్ వన్డే జట్టులో షెపర్డ్ పేరు ఉంది. మే 29 నుంచే ఐపీఎల్ 2025 ప్లేఆఫ్‌లు ప్రారంభమవుతాయి. ఐపీఎల్ కోసం విండీస్ ప్లేయర్స్ భారత్‌లో ఉండటానికి అనుమతిస్తారా లేదా అనేది క్రికెట్ వెస్టిండీస్ ఇంకా ధృవీకరించలేదు.
కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న విండీస్ ప్లేయర్లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ కూడా భారత్‌లో అడుగుపెట్టారు. భారత్‌కు వస్తున్న విషయాన్ని రస్సెల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియోలో రస్సెల్‌తో పాటు నరైన్, షెపర్డ్, డ్వేన్ బ్రావోలు ఉన్నారు.