నిస్వార్ధంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, సాంత్వన కలిగిస్తుందన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరు అని ప్రశంసించారు. నర్సుల కష్టంను తాను స్వయంగా చూశానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం అయ్యారు.
Also Read: Hindupuram: నేడు హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్-1 జబీవుల్లాపై అవిశ్వాసం!
ప్రశంసనీయ సేవలు అందించిన ఎనిమిది మంది నర్సులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యం. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారు. నిస్వార్ధంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివి. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, సాంత్వన కలిగిస్తుంది. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరు. సింగపూర్‌లో మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు వారి కష్టం తెలిసింది’ అని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు.