పాలస్తీనాను సభ్యదేశంగా చేయాలనే ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్ మద్దతు తెలిపింది. పాలస్తీనాకు మద్దతుగా ఓటేసింది. ఐక్యరాజ్యసమితిలో అరబ్ దేశాల సమూహం సమర్పించిన తీర్మానంలో పాలస్తీనా సభ్యత్వానికి పూర్తి అర్హత కలిగి ఉందని పేర్కొంది. కాబట్టి దానిని సభ్యుడిగా చేర్చాలని జనరల్ అసెంబ్లీ మరోసారి సిఫార్సు చేసింది. జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై భద్రతా మండలి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
193 మంది సభ్యులతో కూడిన UN జనరల్ అసెంబ్లీలో మొత్తం 143 మంది సభ్యులు తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా, తొమ్మిది మంది సభ్యులు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. 25 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తీర్మానం ఆమోదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పాలస్తీనాను ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశంగా చేయాలని భద్రతా మండలిని అభ్యర్థించారు. అఖండ మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందడంతో సర్వసభ్య సభ ఆడిటోరియం చాలాసేపు కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఆమోదించిన తీర్మానంలో, పాలస్తీనాను సభ్యదేశంగా చేయాలనే నిర్ణయాన్ని సానుకూల దృక్పథంతో పునఃపరిశీలించాలని భద్రతా మండలిని కోరింది. గతంలో ఈ తీర్మానాన్ని భద్రతా మండలి తిరస్కరించింది. అరబ్ దేశాలతో పాటు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌ను గుర్తించిన మొదటి దేశం భారత్ కాగా.. పాలస్తీనా ప్రతినిధి కార్యాలయం 1996లో న్యూఢిల్లీలో ప్రారంభించారు. భారత్ పాలస్తీనాకు మద్దతు తెలపడంపై ఆదేశం సంతోషం వ్యక్తం చేసింది.