Most Sixes in International Cricket List: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఈరోజు జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం అవుతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. దాంతో ఆస్ట్రేలియాతో జరిగే చివరి వన్డే.. ఐసీసీ ప్రపంచకప్ 2023కు సన్నద్ధం కావడానికి రోహిత్ సేనకు పెద్ద అవకాశం.
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. మూడో వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్ట్, వన్డే, టీ20) అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచే అవకాశం హిట్‌మ్యాన్ ముందుంది. ఈ రికార్డు సాధించాలంటే రోహిత్ ఇంకా 9 సిక్సర్లు బాదాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డే మ్యాచ్‌లో రోహిత్ ఈ అరుదైన రికార్డు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సాధ్యం కాకపోయినా.. ప్రపంచకప్ 2023లో కచ్చితంగా బద్దలు కొడుతాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా ప్రస్తుతం వెస్టిండీస్ వెటరన్ బ్యాటర్ క్రిస్ గేల్ ఉన్నాడు. యూనివర్సల్ బాస్ మూడు ఫార్మాట్‌లలో కలిపి 553 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 545 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ మరో 9 సిక్సర్లు బాదితే.. గేల్‌ను అధిగమించి ప్రపంచ రికార్డును నెలకొల్పుతాడు. ప్రస్తుత ఆటగాళ్లలో రోహిత్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. భారత్ తరఫున రోహిత్ తర్వాత ఎంఎస్ ధోనీ (359 సిక్సర్లు) ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల జాబితా:
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 553 సిక్సర్లు
రోహిత్ శర్మ (భారత్) – 545 సిక్సర్లు
షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్) – 476 సిక్సర్లు
బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) – 398 సిక్సర్లు
మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) – 383 సిక్సర్లు