Only 13 Players Available for Team India for IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. సిరీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. మరోవైపు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది. అయితే వన్డేల్లో ఎప్పుడూ ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేయని భారత్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహతహలాడుతోంది.
మొదటి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ మూడో వన్డే మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. రోహిత్ సహా విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతారు. అలానే రెండో వన్డే ఆడని జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్ నుంచి శుభ్‌మన్ గిల్, శార్దుల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా, మొహ్మద్ షమీలకు టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. ఇక మొహ్మద్ సిరాజ్ మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో పాటు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడతాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లతో కూడిన భారత్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.
సిరీస్ ఓడినా.. ప్రపంచకప్‌కు ముందు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకునేందుకు ఆస్ట్రేలియాకు ఇది మంచి సమయం. ఆసీస్ పూర్తిస్థాయి వన్డే జట్టుతో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్ ఆడని పాట్ కమిన్స్, మార్కస్ స్టొయినిస్ తిరిగి జట్టులోకి రాగా.. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అందుబాటులోకి వచ్చారు. ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్ ఒక్కడే ఫామ్‌లో ఉన్నాడు. స్టీవ్ స్మిత్ తడబాటు జట్టును వేధిస్తోంది. మిచెల్ మార్ష్ ఫామ్ అందుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఆడమ్ జంపా, జోష్ హాజల్‌వుడ్ బౌలింగ్ లో రాణిస్తున్నారు. వీరికి కమిన్స్, స్టార్క్ తోడైతే ఆసీస్ బౌలింగ్ పటిష్టంగా మారనుంది.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు! నేడు తులం ఎంతుందంటే?
భారత జట్టును వైరల్ జ్వరం పీడిస్తోంది. పలు కారణాల వల్ల మూడో వన్డేకు భారత్‌కు 13 మంది ఆటగాళ్లు మాత్రమే సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నారు. ఇందులో 11 మంది మ్యాచ్ ఆడాల్సి ఉంది. రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. కాబట్టి మ్యాచ్‌లో రోహిత్ సేనను నిలువరించడం కంగారూలకు సవాలే. భారత బ్యాటర్లు అందరూ ఫామ్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జియోసినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.