Imran khan: తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పాత్ర ఉందని అన్నారు. తనను హత్య చేసేందుకు అసిఫ్ అలీ జర్దారీ ఉగ్రవాదులకు డబ్బులు ఇచ్చారని శుక్రవారం ఆరోపించారు. గతంలో చేసిన రెండు ప్రయత్నాలు విఫలమైన తర్వాత జర్దారీ తనను హత్య చేసేందుకు దేశ నిఘా సంస్థలతో కలిసి తాజా పథకం పన్నారని ఆరోపించారు. లాహోర్‌లోని జమాన్ పార్క్ నివాసం నుంచి వర్చువల్ విలేకరుల సమావేశంలో ఇమ్రామ్ ఖాన్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కో-ఛైర్మన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ కుట్రలో జర్దారీతో పాటు మరో ముగ్గురు పేర్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. తనకు ఏదైనా జరిగితే దేశం వారిని ఎప్పటికీ క్షమించదన్నారు. జర్దారీ వద్ద అవినీతి సొమ్ము పుష్కలంగా ఉందని, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చేందుకు ఆయన ఉపయోగిస్తున్నారని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు.
Pak Finance Minister: పాక్‌ను అల్లాహ్ సృష్టించాడు, ఆయనే అభివృద్ధి చేస్తాడు..
“ఇప్పుడు వారు ప్లాన్ సి తయారు చేసారు. దీని వెనుక ఆసిఫ్ జర్దారీ ఉన్నాడు. అతని వద్ద పుష్కలంగా అవినీతి డబ్బు ఉంది. జర్దారీ సింధ్ ప్రభుత్వం నుంచి దోచుకున్నాడు. దానిని ఎన్నికల్లో గెలవడానికి ఖర్చు చేస్తాడు. అతను ఒక ఉగ్రవాద సంస్థకు, శక్తివంతమైన వ్యక్తులకు డబ్బు ఇచ్చాడు. ఏజెన్సీలు అతనికి సహాయం చేస్తున్నాయి.”అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.లాహోర్ నివాసం నుంచి అతని అదనపు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద మోహరించిన దాదాపు 275 మంది పోలీసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.