అధికారంలోకి వచ్చిన వెంటనే జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆయనపై కేసు పెట్టాలని కోరుతూ వందలాదిమంది కాప్రా సర్కిల్ కార్మికులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా నేడు (మంగళవారం) నాలుగో రోజు ఈ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాప్రా సర్కిల్ కార్యాలయం నుంచి ఈసీఐఎల్ చౌరస్తాలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ తీశారు.
Read Also: Pilot: అంత కోపం ఏందయ్యా నీకు…బారియర్ గేట్ తెరుచుకోలేదని గొడ్డలితో విరగొట్టిన పైలెట్
కుషాయిగూడ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు చేసిన అనంతరం తిరిగి కాప్రా సర్కిల్ కార్యాలయానికి ప్రదర్శనగా జీహెచ్ఎంసీ కార్మికులు తరలి వెళ్లారు. 2014 ఎన్నికల సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్ఎంసీలో 25 వేల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని వారు అన్నారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నామని.. కార్మికులు కష్టపడి పనిచేసి నగరానికి మంచి పేరు తేవాలని తమను కోరారని జీహెచ్ఎంసీ వర్కర్స్ తెలిపారు.
Read Also: Viral Video : వార్నీ..ఇది ఫోటో షూటా.. కుస్తీ పోటీనా..
కేసీఆర్ పిలుపు మేరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సైతం పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత ప్రతి రోజు కష్టపడి పనిచేసి నగరంలో రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నామని జీహెచ్ఎంసీ కార్మికులు వివరించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కనీస వేతన చట్టం ప్రకారం మా వేతనాలు పెంచలేదు.. సరి కదా మమ్మల్ని పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. దీంతో మా బతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు మమ్మల్ని పర్మినెంట్ చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో జీహెచ్ఎంసీ కార్మికులు కోరారు.