Meghalaya: మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్.సి.మారక్(82) శుక్రవారం వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 82 ఏళ్ల వయస్సు గల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తురా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1993లో ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసిన రాష్ట్రానికి మారక్ మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. 1998లో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణం కుప్పకూలినప్పుడు అతి తక్కువ సమయం – 12 రోజులు – సీఎం పదవిని కూడా నిర్వహించారు. 2003లో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా కూడా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి మృతికి నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.
Read Also: Bank Manager Fraud: 26 కిలోల బంగారంతో ఉడాయించిన బ్యాంకు మేనేజర్..
మారక్ మృతి పట్ల ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సంతాపం తెలిపారు. “మాజీ సీఎం సాల్సెంగ్ సీ మారక్ మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. మేఘాలయ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.” అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా మారక్ మృతికి సంతాపం తెలిపారు.“మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ ప్రెసిడెంట్ సాల్సెంగ్ సి మారక్ మరణం పట్ల మేము చాలా బాధపడ్డాము. మేఘాలయ అభివృద్ధికి ఆయన అలసిపోని నిబద్ధత శాశ్వత వారసత్వాన్ని మిగిల్చింది. మా గౌరవం, ప్రశంసలను సంపాదించింది” అని ఎక్స్ వేదికగా ఖర్గే సంతాపం తెలిపారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆగస్టు 12 నుండి తురా సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 8న ఆయన మొదట హోలీ క్రాస్ ఆసుపత్రిలో చేరినట్లు వారు తెలిపారు.1941లో జన్మించిన మారక్ కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కళాశాలలో చదువుకున్నారు. మేఘాలయలోని నార్త్ గారో హిల్స్‌లోని రెసుబెల్‌పరా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.