World Cup 2023 Final: వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా విధించింది సైబర్‌సెల్. అనంతపురం పోలీస్ సైబర్ సెల్ ద్వారా సుమారు 70 బెట్టింగ్ ఆన్‌లైన్ యాప్‌లను గుర్తించారు. ఈ యాప్‌లను నిషేధించాలని సంబంధిత శాఖలకు జిల్లా ఎస్పీ సిఫారసు లేఖ రాశారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించమన్నారు. క్రికెట్ బెట్టింగు నిర్వాహకులు, పందేలు కాచే వారెరవర్నీ వదలకండి.. క్రికెట్ బెట్టింగ్ జోలికెళితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగులతో సంబంధాలు ఉన్న పాత నేరస్తులు 50 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు.
Also Read: JD Laxminarayana: ప్రజల వద్దకే పోలింగ్ బూత్ వచ్చేలా చేయాలి..
2023 వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా దిగ్గజ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ జరుగుతుండటంతో అందరి దృష్టి అటువైపే ఉంటుంది. క్రికెట్ ఆటను వీక్షిస్తూ ఆనందించాలే తప్ప బెట్టింగుల జోళికి వెళ్లకూడదని జిల్లా ఎస్పీ సూచిస్తున్నారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగు నిర్వాహకులు, పందెంరాయుళ్లపై ప్రత్యేక నిఘా వేయాలని, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. అమాయక ప్రజలను, యువకులను లక్ష్యంగా చేసుకొని, ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చని ఆశలు రేకెత్తించేలా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకులను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించమన్నారు.
Also Read: Karumuri Nageshwara Rao: జగన్ సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్ష నేతలు తలదించుకోవాలి..
ఏపీ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తామని జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపింది. శ్రమించకుండా వచ్చే నగదు వెనుక అనేక నష్టాలు దాగి ఉంటాయి. ఈ విషయం యువత గుర్తెరగాలి. కేసుల్లో నిందితులుగా మారి జీవితాలను నాశనం/దుర్భరం చేసుకోవద్దన్నారు జిల్లా ఎస్పీ. తమ తల్లిదండ్రుల కోసం ఉన్నతంగా బ్రతకాలని, బెట్టింగ్ రాయుళ్ళ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచనలు చేశారు. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే సదరు సమాచారాన్ని డయల్ 100 కు లేదా తన మొబైల్ నెంబర్ 9440796800 కు సమాచారమివ్వాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.